Pages

22, ఫిబ్రవరి 2012, బుధవారం

దత్త పది " హరి , చక్రి, విష్ణు , రామ ",

భక్త సులభుడు రాముడు ముక్తి నియగ
హరిని సేవించి తరియించ పాప హరము
చక్రి గొలిచిన తొలగును వక్ర బుద్ధి
వేరు నామము లెన్నైన విష్ణు మయమె !

18, ఫిబ్రవరి 2012, శనివారం

" నిషిద్ధాక్షరి " శ, ష , సః , హ "

గుగ్గిలము నాయనారట
గుగ్గిలపుం బొగను ముంచి గోపతి ప్రీతిన్ !
గగ్గోలు పడుచు భక్తిని
గుగ్గిలమే గుడిని నింపి గొలిచె కపర్ధిన్ !

16, ఫిబ్రవరి 2012, గురువారం

" రామా నాదరి రాకు రాకు మనియెన్ రంభే భయబ్ర్హాం తయై "

లేమా యేటికి భీతి చెందెదవు నీ లేబ్రాయమున్ మెచ్చితిన్
కామోద్రేకము కాదు కాదిది నినున్ కాంక్షించి మోహంబునన్
భామా వీడను నిన్ను నేనిక నభంబే క్రుంగి భీతిల్లగన్
రామా నాదరి రాకు రాకు మనియెన్ రంభే భయ భ్రాంతయై

13, ఫిబ్రవరి 2012, సోమవారం

" జనకుని జంపి దాశరధి జానకి దెచ్చెను శౌర్య మూర్తియై "

ధనువును వంచి రాజుల మదంబు నడంచి పరాక్ర మంబునన్
జనకుని కూతురైన జలజాక్షిని సీతను వీడ కుండగన్
వనముల యందు గ్రమ్మరుచు వారధి దాటి జయించి నింద్రజిత్
జనకుని జంపి దాశరధి జానకి దెచ్చెను శౌర్య మూర్తియై

"[ దత్త పది ] " ఈగ , దోమ , పేను , నల్లి "

పేను కొరుకుడు నెత్తికి పెత్త నమ్ము
దోమ లన్నియు జేరెను తోక ముడిచి
నల్లులై కుట్టి ప్రాణుల నంచి తినెడి
ప్రభువు లుండిన [ ఈ ] నీగతి ప్రజల కెపుడు
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase