Pages

29, జూన్ 2012, శుక్రవారం

" పద్య రచన " బిచ్చగాని చిత్రం "

నడువ లేను బాబు నడి రోడ్డుపై నేను
దైవ మిటుల వ్రాసె దయను వీడి
పెద్ద మనసు జేసి బిచ్చ మిడిన చాలు
నేను బ్రతుక గలను నీదు కృపను

" కనులు లేని వాడు కన్ను గొట్టె "

మాట పలుక లేడు మది నిండ భావాలు
సొగసు లొలుకు తరుణి సోయ గమ్ము
కలలు కనగ మెండు కలవర పడినంత
కనులు లేని వాడు కన్ను గొట్టె !

27, జూన్ 2012, బుధవారం

" రణ మది శాంతి సౌఖ్యముల రాజిలజేయుచు గూర్చు శ్రేయముల్ " !

గణనము జేసి చూడగను కారణ మేమియు గాన రాదిలన్
మణి మయ మైన జీవితపు మారుని బోలిన భర్త చెంతనే
అణకువ లేక నాగరి కతాతి శయంబును వీడి మనుమా
రణమది శాంతి సౌఖ్యముల రాజిల జేయుచు గూర్చు శ్రేయముల్ !

26, జూన్ 2012, మంగళవారం

పద్య రచన భీష్ముడు అంపశయ్యపై నుండుట "

బ్రహ్మ చారిగ మిగిలెను ప్రతిన బూని
వరము పొందెను స్వచ్చంద మరణ మనుచు
అష్ట వసువుగ ముక్తుడై కష్ట పడగ
అంప శయ్యను కోరినా డాత్మ విధుడు

20, జూన్ 2012, బుధవారం

" పద్య రచన " మోహిని అమృతము పంచుట "

సుధను పంచగ వచ్చెను సుంద రాంగి
అసురు లెల్ల మైమరచియు వెసను బడుతు
మధవు కంటెను మత్తిల్లె మగువ సొగసు
అసలు సంగతి మరచిరి యసురు లనగ !

19, జూన్ 2012, మంగళవారం

" బిడ్డడా వాడు రణరంగ భీకరుండు "

కుంతి తనయుని చేకొని గుడికి బోవ
పులిని గనినంత భీతిలి బాలు నొదిలె
బండ రాళ్ళన్ని పగిలెను పిండి పిండి
బిడ్డడా వాడు ? రణరంగ భీకరుండు !

18, జూన్ 2012, సోమవారం

" జాలమే యవరోధమ్ము సాధకులకు "

నాది నాదను బాధలు నరుల కెపుడు
ఐహిక ములందు తమకమ్ము నైక్య మగుచు
మదిని మరలించ లేనట్టి మత్తు విడక
జాలమే యవరోధమ్ము సాధ కులకు

16, జూన్ 2012, శనివారం

" బాణు రాజ్య మొసగు పరమ సుఖము "

మగువ మనసు దోచి మాయలే కల్పించి
రాస క్రీడ లందు రాధ గాంచి
గోకులమ్ము నందు గోప కాంతల పుష్ప
బాణు రాజ్య మొసగు పరమ సుఖము !
----------------------------------------
బాణు డనగ నతడు బాణ భట్టా చార్యు
రచన లెన్నొ చేసె రసమ యముగ
చండి శతము నొసగి చరితార్దు డైనట్టి
బాణు రాజ్య మొసగు పరమ సుఖము

15, జూన్ 2012, శుక్రవారం

" పాలిమ్మని సుతుని భర్త పాలికి పంపెన్ ! "

చాలించుము పరిహాసము
స్త్రీ లందరు పురుషు లవగ చింతే మిటికిన్ !
లాలన పోషణ మీదిక
పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్ !

" రక్ష ణమ్ము నొసగు రాక్ష సుండు "

దాన మీయ దలచె దనుజు డైనను బలి
తనదు క్షేమ మెంచ తలపు లేక
ఆది శేషు డొచ్చి యడుగంగ కొరతేమి
రక్ష ణమ్ము నొసగు రాక్ష సుండు !

12, జూన్ 2012, మంగళవారం

" పద్య రచన " భగీరధుడు గంగను రప్పించుట "

తపము ఫలించె భగీరధ
నెప మెన్నక దుమికె గంగ నెవ్వడి తరగల్ !
కపటము తెలియక పరుగిడె
జప తపముల మునుల దాటి సగరుల పైనన్ !

" భోగ రక్తు డగు ముముక్షు వెపుడు "

భక్తి పెరిగి నంత భగవంతుని యెడ వి
రక్తి కలుగ లేదు లక్ష్మి పైన
జపము తపము జేసి శాంతింప లౌల్యమ్ము
భోగ రక్తు డగు ముముక్షు వెపుడు !

" పద్య రచన " [ గంగ అష్ట వసువులను నీటిలో విడచుట ]

అష్ట వసువుల శాపము నిష్ఠ గాను
తొలగ జేయగ శిశువుల జలము నందు
విడుచు చుండగ వారించు విభుని వీడి
యలిగి నాకమ్ము నకు నేగె నమర గంగ !

11, జూన్ 2012, సోమవారం

" విక లాంగుడు రధము నడిపె విను వీధి పయిన్ ! "

వికలము చెందిన యరుణుడు
సకలము త్యజియించి చనెను సవితుని సేవన్ !
వికసితము నొంద గోరుచు
వికలాం గుడు రధము నడిపె విను వీధి పయిన్ !

7, జూన్ 2012, గురువారం

" పద్య రచన " [ నటి సావిత్రి ]

కవుల కలమందు కదలాడు కావ్య మీవు
నవ రసమ్ములు కురిపించు నవ్య చరిత
మరపు రానట్టి మత్యాల సరము గాదె
ఎదను కదలించు నచ్చర యంద మనగ !

" ఎండను నిద్రించ సుఖము నిచ్చును మిగులన్ "

మెండుగ శీతల మందున
నిండుగ లేపనము లలది నీటగు దొరలే !
పండె దరు సైకతమ్మున
ఎండను నిద్రించ సుఖము నిచ్చును మిగులన్ !

4, జూన్ 2012, సోమవారం

" రావణా గమనము గోరె రమణి సీత "

మాయ లేడిని చూపించి మర్మ మెరిగి
మాన వాళికి యవతార మహిమ దెలియ
ప్రాణ సఖుడైన రాముని ప్రతిభ గోరి
రావణా గమనము గోరె రమణి సీత
-------------------------------------
ఉత్సాహ .
నీవె నాదు ప్రాణ ధనము నీవె నాదు యశము గా
భావ జాల మందు చిక్కి బాధ మరువ నెంచి తిన్
అవని జాత నైన నన్ను నాద రించ దైత్య వి
ద్రావణా గమనము గోరె రమణి సీత మోద మున్ !

3, జూన్ 2012, ఆదివారం

" సురభికి జన్మించె ఖరము చోద్య మెటులగున్ !

మర మనుషుల కలియుగ మట
పురుషులు స్త్రీలవగ వింత ముచ్చట గాదే !
వెఱ గుపడి సురలు గాంచగ
సురభికి జన్మిం చె ఖరము చోద్య మెటులగున్ !

2, జూన్ 2012, శనివారం

" తనయను సేవింప నొదవు దద్దయు సుఖముల్ "

ధనమే జగతికి మూలము
కనకపు సింహాసనమున గాంచగ సుఖముల్ !
తరరుచును క్షీర సాగర
తనయను సేవింప నొదవు దద్దయు సుఖముల్ !
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase