Pages

30, ఆగస్టు 2010, సోమవారం

మాం దాత

టెస్ట్ ట్యూబ్ బేబీలంటే గుర్తొచ్చింది, అందుకే ఈ ఆర్టికల్ రాయాలనిపించింది. బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఐతే ఇంతకీ అసలు పూర్వ కాలంలో పురుషులు కూడా గర్భాన్ని ధరించి పిల్లల్ని కనేవారట. ఇప్పుడు ఆధునిక పరిశోధనలు జరిపి కృత్రిమ గర్భధారణ పద్ధతులు వచ్చాయి గానీ, మన పురాణ యుగంలోనే ఋషులు వేద మంత్రాలతో పుత్ర కామేష్టి వంటి యాగాలు చేసి సంతానోత్పత్తి చేసేవారన్నది జగద్వితమే. రామాయణ కథలో నాయకుడైన రాజు జననం అలాంటిదేనట. మహాభారతంలో కౌరవులు, పాండవులు, ద్రౌపది లాంటి వారి జననములు మరికొన్ని పద్ధతుల ద్వారా జరిగాయట. ఇక రాముడు, మొదలైన వారు మాతృమూర్తులకే జన్మించినా, అంతకు ముందు చాలా కాలంగా ఇక్ష్వాకు వంశం లోనే ఒక రాజు, తండ్రికి జన్మించాడట. అతడే "మాంధాత చక్రవర్తి". పూర్వం ఇక్ష్వాకు వంశంలోనే యవనాశ్వురుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకి వంద మంది భార్యలు ఉండేవారు. కానీ ఒక్కరికీ సంతానం కలుగలేదు. అలాగైతే వంశం అంతరించి పోతుందని దిగులు చెంది, నమ్మకస్తులైన మంత్రులకు రాజ్య భారాన్ని అప్పగించి, తన వంద మంది భార్యలను తీసుకుని మనశ్శాంతి కోసం యవనాశ్వురుడు అరణ్య వాసం చేద్దామని బయలుదేరాడు. అలా వెళ్ళిన కొద్ది రోజుల్లోనే దైవికంగానే అక్కడ అరణ్యంలో ఉన్న మునులు, రాజు మంచితనాన్ని గ్రహించి, అతడికి ఏ విధంగానైనా సాయపడాలని నిర్ణయించుకున్నారు. పుత్ర కామేష్టి యాగాన్ని జరిపించి అతనికి సంతానం కలిగేలా చేయాలనుకున్నారు. అందుకు రాజు చాలా సంతోషించాడు. వెంటనే అక్కడి మునులందరు కలసి దేవేంద్రుని ఉద్దేశించి పుత్ర కామేష్టి యాగం చేసారు. ఆ యాగంలో ఒక భాగంగానే, ఒక కలశం లో మంత్ర జలాన్ని సిద్ధం చేసి ఉంచారు. ఐతే ఆ కలశంలోని జలాన్ని మరునాడు ఉదయాన్నే యవనాశ్వురుడి మొదటి భార్య చేత తాగించాలని అనుకున్నారు. ఇక ఆ రాత్రికి ఎవరి నెలవులకు వారు వెళ్ళి నిద్రించారు. ఐతే ఎన్నడూ లేనిది రాజుకు అర్థరాత్రి వేళ విధి విలాసమా అన్నట్టు విపరీతమైన దాహం వేసింది. అందుకు వీళ్ళనీ, వాళ్ళనీ లేపి నీళ్ళడగటం ఎందుకని, రాజు తానే స్వయంగా లేచి ఇటూ అటూ వెదకసాగాడు. కొంచం దూరంగా నీళ్ళున్న కలశం కనుపించింది. అప్పుడు కలశంలోని నీరు తాగి దాహం తీర్చుకుని పడుకున్నాడు.మర్నాడు మునులు వచ్చి చూస్తే కలశం ఉంది గానీ నీళ్ళు లేవు. ఆరా తీసి అడిగితే రాజు తానే తాగానని చెప్పాడు. మునులు దైవ నిర్ణయంముగిసిన పిమ్మట ఎటు వారటు వెళ్ళిపోయారు.
కొంత కాలం గడిచేసరికి రాజు గర్భం ధరించి నెలలు నిండిన ఒక శుభ ముహుర్తాన అతడి పొట్ట కుడి వైపు భాగాన్ని చీల్చుకుని ఒక మగబిడ్డ జన్మించాడు. యవనాశ్వురుడు దైవానుగ్రహము వలన బిడ్డ పుట్టగానే మరణించి ముక్తి పొందాడు. కానీ పుట్టిన బిడ్డ తల్లి పాల కోసం విలవిలలాడుతుంటే, ఆ బాధ చూడలేని దేవేంద్రుడు తన అనుగ్రహము వలన పుట్టిన ఆ బిడ్డ దగ్గర కొచ్చి బిడ్డను ఓదారుస్తూ దైవ భాషలో (సంస్కృతం) "మాం ధాతా" (అంటే "ఓ బిడ్డా ఏడవకు నన్ను తాగు నన్ను తాగు" అన్నది ఆ మాటలకర్థం) అని అంటూ తన చూపుడు వేలుని ఆ బిడ్డ నోటికి అందించాడట. ఆ వేలు ద్వారా అమృతం స్రవించిందట. అలా పుట్టిన బిడ్డయే పెద్దవాడై "మాంధాత చక్రవర్తి" అయ్యాడట. అతడికి శతబిందు కుమార్తె బిందుమతితో వివాహమైయింది. వారికి "పురుక్సుతుడు, అంబరీషుడు, ముచి కుందురుడు" అనే ముగ్గురు మగ పిల్లలు, 50 మంది ఆడ పిల్లలు కలిగారట. ఇలా మాంధాత ఒక పురుషుడికి పుట్టిన బిడ్డగా, సప్త ద్వీపాలను ఏలిన ఒక చక్రవర్తి గా పురాణాలలో కనుపిస్తాడు. అంటే, ఇప్పటివలే సూదులు, కుట్లు, మందులు లేకుండానే మంత్రాలు, మంత్ర జలాలతోనే మన ఋషులు ఎన్నో అద్భుతాలు చేసే వారన్న సంగతిందువలన మనకు తేట తెల్లమౌతోంది .

ఎల్సీ కోర్ట్

జెర్సీ ఆవుల గురించి విన్నాం గానీ, ఎల్సీ కోర్ట్ గురించి ఎంత మందికి తెలుసు? ఏమో! అందరికి తెలుసేమో గానీ, నాకు మాత్రం ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే, రోజూ ఉదయం సాయంత్రం వాకింగుకి ఆ కోర్టు ముందునుంచే వెడతాం గనుక, అక్కడున్న ఆ బోర్డు ఈ రోజే చదివాను గనుక. ఇంతకీ జెర్సీ ఆవైనా, ఎల్సీ కోర్టైనా, శ్రీ శ్రీ చెప్పినట్టు అదే "అగ్గి పుల్ల కుక్క పిల్ల సబ్బు బిళ్ళ" లాగ అన్నమాట. వాకింగంటే, ఈ సమ్మరు పుణ్యమా అని జైలు వదలిన ఖైదీల్లా, ఆడా మగా, పిల్లా పెద్దా, ముసలీ ముతకా అందరూ హాయిగా గాలి ఫీల్చుకుంటారు. ఏసీలూ, హీటర్లు అన్నీ ఆపేసి, తలుపులు తీసుకుంటారు. పిల్లలు స్విమ్మింగుకి (పెద్దలు కూడా), టెన్నీస్, బాస్కెట్ బాల్, సైక్లింగ్, అలా వారి వారి ఇష్టాలకి పరుగులు తీస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వాకర్ గార్డెన్లో, భారతీయత ఉట్టిపడుతూ ఉంటుంది. రంగు రంగుల సీతాకోక చిలుకల్లా, అందమైన చీరలు, చక్క చక్కటి డ్రెస్సులు, ముచ్చట ముడులు, వాలు జడలు విరబోసిన జుట్లు, జుట్టుకి హైలైట్లు (రంగులు), ఇలా కొందరుంటే, టైటు పాంట్లు, టీ షర్ట్లు, చెడ్డీలు, మిడ్డీలు, స్లీవ్ లెస్సులు, తెల్ల వాళ్ళు, నల్లని వాళ్ళు, మధ్య రకం వాళ్ళు, పొట్టి పొడుగు లావు సన్నం, ఇలా రకరకాలుగా వాకింగు సోయగాలతో కన్నుల విందు చేస్తూ ఉంటారు. ఇక స్విమ్మింగ్ పూల్ లో ఐతే, అర మీటరు బట్టతో, అవసరమైన చోట్ల తప్పా, మరే ఆచ్చాదన లేక అందాల భామలు అలా అలా మత్స్య కన్యల్లా, నీళ్ళల్లో మునుగుతూ తేలుతూ, ఒడ్డున కూర్చున్నవారికి ప్చ్! ఏ కవుల కలాల్లో ఎలా రంగరింపబడతారో ఉహాతీతమే. ఇక, దేశం చూడాలనో, అమ్మాయి డెలివరీ కనో, పిలవగా వచ్చిన అమ్మలు, కొడుకులు మాత్రమే (కోడళ్ళు పిలవక పోయినా)పిలవగా వచ్చిన అత్తలు, "అమ్మ వెళ్ళిపోతే ఈ చాకిరీ అంతా ఎలా చేసుకోవాలా?" అని బాధ పడే కూతుళ్ళూ, అమెరికా వచ్చినా అత్త పోరు తప్పలేదని తిట్టుకునే కోడళ్ళూ, వదిలేసిన ఉద్యోగాలూ, నడుస్తున్న రాజకీయాలు మాట్లాడుకునే తండ్రులు, ఇలా ఎవరికి వారు జట్ట్లు జట్ట్లు గా వాగ్వివాదాలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నట్లు గుబురు గుబురుగా చక్కగా చిక్కగా కొత్త చివురులు తొడుగుతున్న చిట్టడవుల్లా పచ్చదనానికి ప్రతీకగా అంతెత్తు వృక్షరాజాలు. ఆ మధ్య నుంచి నిమిషానికో సారి రణగొణ ధ్వని చేసుకుంటు దూసుకు పోయే రైళ్ళ శబ్ధ తరంగాలు, ఏ హారను లేకుండా, రోడ్డు మీద చిరు సవ్వడితో సాగి పోయే కార్లు, రోడ్డుకిరు వైపులా సన్నని కాలిబాటలు "లాన్ డాక్టర్లు" అందంగా కట్ చేసిన పచ్చిక దారులు పైన హాయిగా గుంపులు గుంపులుగ ఎగిరే స్వేచ్చా విహంగాలు సునిసితంగా తాకిపోయే సన్నని గాలి తెమ్మెరలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో అందంగా హాయిగా ఆహ్లాదంగా ఉండే ప్రకృతి సౌందర్యం అనుభవేద్యమే గానీ వర్ణనాతీతం. ముఖ్యంగా సమ్మరులో ప్రతి వాళ్ళూ ఇంటి ముందరా వెనుక (బాక్ యార్డ్ ) పూల మొక్కలు, కాయ గూరలూ, వారి వారి ఇస్టాలని బట్టి పెంచుకుంటారు. అంతే కాదు డెక్ (పాటియో) మీద సమ్మరుని వీలైనంత ఎంజాయి చేస్తూ ఉంటారు.
ఇంతకీ మనం వాకింగులో పడి ఎటో వెళ్ళి పోతున్నామా? లేదు, అదిగో ఎల్సీ కోర్ట్ కి రానే వచ్చాం. ఇంతకీ ఈ "ఎల్సీ" అనేది ఒక ఆవు. అసలు ఈ వాకర్ గోర్డెన్ ఒకప్పుడు డైరీ ఫారంగా ఉండేదట. 150 పైగా ఆవులు ఉండేవట. వాటిలో ఒక ఆవు ఎక్కువగా పాలు ఇచ్చేదట. అందువలన ఆ పాల ఏజెన్సీ మన ఆవుకి "ఎల్సీ" అని పేరు బెట్టి, వ్యాపారం మొదలుపెట్టగా విపరీతమైన లాభాలు రావడంతో ఆవు బొమ్మనే గుర్తుగా వ్యాపార ప్రకటనలకి వాడుకున్నారట. ఎక్కువగా పాలు ఇస్తూ లాభాలు పెంచి అందరిని ఆకట్టుకుని చిరస్థాయిగా ఫేరు మిగుల్చుకుంది. ఈ పాలమీద వచ్చిన డబ్బు పది మిలియన్ డాలర్లు, రెండవ ప్రపంచ యుద్ధంలో క్షతగాత్రులకి విరాళంగా ఇచ్చారట. ఇంతకీ అసలు ఒక పత్రికలో కార్టూన్ సీరియల్ గా వస్తున్న ఒక జంతువు, అదే ఆవు బొమ్మ గుర్తు, ప్రపంచ వ్యాప్తంగా ప్రకటన గుర్తుగా పేరు పొందింది. ఈ బొమ్మ పేరుతో హోటళ్ళూ, మోటళ్ళూ, స్వీట్ షాపులు, వెబ్ సైట్లు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. అది ఒక జంతువు, ఆవు ఐనా 1932 నుంచి 1940 వరకు అందరినీ ఆకట్టుకుని చరిత్రలో నిలిచింది. ఇంతకీ ఒకనాడు, న్యూయార్క్ సిటీ నుంచి వాకర్ గోర్డన్ కు తిరిగి వస్తూండగా, ఒక పెద్ద ట్రక్కు కొట్టేయడంతో, బాగా దెబ్బలు తగిలి, వెంటనే మరణించిందట. అప్పుడు దాని మృతదేహాన్ని, ఇదే వాకరు గోర్డెన్లో పాతిపెట్టి, ఒక చిన్న మండపంలా చెక్కతో కట్టి, అక్కడే రాతిపలక మీద దాని చరిత్ర కొంత రాసి ఉంచారు. నిజానికి ఒకప్పుడు న్యూజెర్సీ ప్లైన్స్ బరో బంగారు భూమిగా అనుకునేవారట. కానీ అది నిజంగానే బంగారం పండించిందన్న సంగతి ఈ ఎల్సీ ద్వారా మరింత దృఢపడింది. ఎందుకంటే అది మంచి ప్రకటన గుర్తు. దాని మరణానంతర ఆ పాల వ్యాపారం అక్కణ్ణుంచి తరలి పోయింది. పిమ్మట ప్లైన్స్ బరో వాకరు గోర్డెన్ లో, ఎన్నో ఇళ్ళు వెలిసి, కాలనీలా తయారైంది. అదే ఈ ఎల్సీ కోర్ట్ ! ఎల్సీని అన్ని సందర్భాలలో గుర్తు చేసుకుంటారు. దాని జ్ఞాపకార్ధం, 40 అడుగుల విగ్రహాన్ని తయారు చేసి స్పోర్ట్స్ టీమ్ గుర్తుగా ఉంచాలని ఒక ప్రయత్నం. అది చదివాక, మనసు కలత పడింది. ఏమైతేనేం? ఇక్కడ జంతువుల్ని బాగా పెంచుతారనిపిస్తుంది. ఎందుకంటే, వాటి పేర్ల మీద ఆస్తులు రాయడం, సమాధులు కట్టడం, తరచూ తెలుస్తూ ఉంటుంది. ఇక పిల్లలని 18 ఏళ్ళు రాగానే వదిలేస్తారు. భార్యా భర్తలు ఎంత కాలం కలసి ఉంటారో, ఎప్పుడు విడిపోతారో తెలియదు. అందుకేగా, పిల్లలకి గార్డియన్ గా తల్లి పేరే రాస్తారు. అందుకే ఫాదర్స్ డే, మదర్స్ డే, లవర్స్ డే అంటూ ఆ డే నాడు మాత్రం కలుస్తారు. మరి ఆ ప్రేమలేమిటో అంతు బట్టనివి. కక్షలు, కార్పణ్యాల మధ్య నిలువెల్లా విష పూరితమైన మనిషి కంటే తాను గడ్డి తిని మనకి పాలిచ్చే ఆవు, ఆ మూగ జీవే నయమనిపిస్తుంది. పసివారిని విడిచి జాకెట్ట్లు తడుపుకుంటూ ఆఫీసులకు వెళ్ళే భార్యలను చూసి గుండెలో సన్నని బాధ కదిలినా, "ధన మూలం ఇదం జగత్తు కదా?" అని సరి పెట్టుకోవాలి. జీవితం భార్యతో ముడివడినది గనుక, సీసాతో పాలు ఎవరైనా పట్టవచ్చును గనుక, సమానత్వం పేరుతో బేసిన్లు తోమాలి, ఇంటి పనులు చేయాలి, పిల్లల్ని చూడాలి. హతవిధీ? హా పురుష పుంగవా? అందుకే రాను రాను బరువనిపించే అమ్మ పోయినా, మళ్ళీ మళ్ళీ, పోషక విలువలున్న ఆవు పాలు మాత్రం అనునిత్యం పసివారికి చాలా అవసరం. ఎందుకంటే, మరి ఈ రోజుల్లో ఆవు పాలు ఆయా పాలు బాటిల్ పాలే కదా? అందుకే అమ్మలాంటి ఆవు ఆరోగ్యమైన పాలు. తమ పిల్లలకి అమ్మకి బదులు ఆవు, అదే "ఎల్సీ ది కౌ".

25, ఆగస్టు 2010, బుధవారం

సమస్య " పురుషుడు ప్రసవించె పుణ్య తిధిని. "

కాల మన్న నేమి కలి కాలమే యిది
మంచి యన్న నేమి మించి లేదు.
మనిషి నెంచి చూడ మనుగడయే కలి
పురుషుడు ప్రసవించె బుణ్య తిధిని

24, ఆగస్టు 2010, మంగళవారం

మేడి చెట్టు.

మేడిపండు చూడ మేలిమైయుండు పొట్టవిప్పి చూడ పురుగులుండు... అని వేమన గారి పద్యం చదువుకున్నాం కదా! మరి ఆ మేడి పండులో పురుగులుంటాయే గాని ఆ చెట్టుకి ఎంతటి మహత్యం ఉందో తెలుసుకుందామా? పూర్వం ప్రహల్లాదుడి తండ్రి "హిరణ్యకశిపుడు" అనే రాక్షరాజు తనకొడుకు ప్రహల్లాదుడిని తనకి శతృవైన హరి భక్తుడని ఎన్నో బాధలు పెట్టాడు. నీ హరి ఎక్కడున్నాడు ఈ స్థంభంలో ఉన్నాడా చూపించు అని ప్రహల్లాదుణ్ణి హింసించినప్పుడు "తండ్రీ ఇందు గలడందులేడని సందేహము లేదు విశ్వమంతట ఉన్నాడు" అని చెప్పి భగవంతుడిని ప్రార్ధించగా, స్థంభం పగులగొట్టగా నరసింహావతారంలో శ్రీహరి ప్రత్యక్షమై హిరణ్యకశిపుణ్ణి తన బలమైన గోళ్ళతో చీల్చి చంపుతాడు. అలా చంపటంవల్ల దుర్మ్మార్గుడైన రాక్షసుడి రక్తం విష్ణువు చేతులకంటుకుని మంటలు పుట్టాయట. అప్పుడు లక్ష్మీదేవి మేడిచెట్టు ఆకులతోను ఆ పండ్లతోను శీహరి చేతులు తుడిచి ఆ మంటల బారినుండి ఉపశమనం కలిగించిదట. అందుకు సంతసించిన విష్ణువు "నిన్ను భక్తితో సేవించినవారికి విష బాధలు తొలగి పాపాలు నశించి అభీస్టాలు నెరవేరుగాక" అని గొప్ప వరమిచ్చాడట. అంతేగాక నీ చెట్టు నీడన చేసిన జపతపాదులకు యజ్ఞయాగాదులకు అపారమైన ఫలితముండుగాక అని ఆశీర్వదించి మేము ఎల్లవేళల నీయందే నివశించిఉంటాము అని ఎన్నో వరాలని ప్రసాదించాడు. దీనినే "ఉదుంబర వృక్షము" అని కూడా అంటారు. చూసారా బాలలూ పండులో పురుగులుంటేనేమి చెట్టుకి ఎంతటి పవిత్రత ఉందో? అంచేత ఎవరి అదృష్టం వారిదే ఎవరి పేరు ప్రఖ్యాతులు వారివే. పురుగులున్నంత మాత్రాన దోష గుణం లేదు, భగవంతుడి విష బాధని తొలగించింది కదా? తల్లి చెట్టుతోపాటు తనకీ పుణ్యం అబ్బింది

21, ఆగస్టు 2010, శనివారం

శ్రీ చింతా రామ కృష్ణా రావు గారి ఆంధ్రా మృతం నుండి


చెట్టుకు నమస్కరించి అనుమతి కోరి పూలు కోసు కోవాలి
----------------- ----------- ------ ---------
పువ్వులనుకోసేముందు ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ కోయాలని పెద్దలు చెప్పరు.
శ్లోll
నమస్తే కుసుమా ధారే, నమస్తే కమలాలయే
పుష్పాణి విష్ణు పూజార్థం, ఆహరిష్యే తవాజ్ఞయా!
.గీ.ll
వందనము నీకు పుష్ప సౌభాగ్యధారి!
వృక్ష రాజమ! హరికి నే బ్రీతి తోడ
పూజ సేసెద పూలతో. పూలు కోయ
నానతిని వేడు చుంటి. నా కానతిమ్ము.
జైశ్రీరాం.
జైహింద్.

19, ఆగస్టు 2010, గురువారం

సాయి యన్న నేమి మాయ చేయడు మనను
మాన సంబు నందు మనన చేయ
చేరి కొలిచి నంత చేయూత నీయగ
వెన్ను గాచి మనల వెంట నుండు.

" పొర బాటున్నయెడల గురువులు సవరణ చేయ గలరని మనవి "

15, ఆగస్టు 2010, ఆదివారం

చింతా రామ కృష్ణా రావు గారి ఆంధ్రామృతము నుండి



" ఇదిగో లంచం తీసుకుని ఆ కిటుకేమిటో చెప్పవే నెమలీ "
కంద - గీత - గర్భ ఉll
ఓ నెమలీ! సఖీ! ఎటుల నోచి; మదీయుని; కృష్ణుఁ జేరి; శ్రీ
జ్ఞాన మతిన్ సదా చతుర! కామ్య ఫలంబును చక్క నందితో?
నీ నమనంబునన్ శిరము నేర్పుమెయిన్ దగఁ జేరినావు. పో
నీనునినున్. కృపన్ తెలిపి నేర్పును గొల్పుము దివ్యుఁ జేరగా!
కll
నెమలీ! సఖీ! ఎటుల నో
చి; మదీయుని; కృష్ణుఁ జేరి; శ్రీ జ్ఞాన మతిన్.
నమనంబునన్ శిరము నే
ర్పుమెయిన్ దగఁ జేరినావు. పోనీనునినున్.
తే.గీll
ఎటుల నోచి; మదీయుని; కృష్ణుఁ జేరి;
చతుర! కామ్య ఫలంబును చక్క నంది
శిరము నేర్పుమెయిన్ దగఁ జేరినావు.
తెలిపి నేర్పును గొల్పుము దివ్యుఁ జేర!
కంద - గీత - గర్భ ఉll
లంచము నిచ్చెదన్. కలుగు లాభము నిచ్చెద. గాంచుమమ్మ! బా
లంచు మదిన్; ననున్ వెలుగు లందును నీ కృప వెల్లు వైనచో
లంచము నిచ్చు నా హరియు లాస్యము సేయును. హాయిఁ గొల్పు చా
లంచననౌన్ గదా! శిఖిరొ! డంబము చాలును.చెప్పు మమ్మరో!
కllచము నిచ్చెదన్; కలుగు లా
భము నిచ్చెద; గాంచుమమ్మ! బాలంచు మదిన్.
చము నిచ్చు నా హరియు లా
స్యము సేయుచు ; హాయిఁ గొల్పు; చాలంచన నౌన్.
తే.గీll
కలుగు లాభము నిచ్చెద గాంచుమమ్మ!
వెలుగు లందును నీ కృప వెల్లువైన.
హరియు లాస్యము సేయును; హాయిఁ గొల్పు.
శిఖిరొ! డంబము చాలును. చెప్పవమ్మ!
జైశ్రీరాం.
జైహింద్.

11, ఆగస్టు 2010, బుధవారం

సమస్య " వేశ్య కప్ప గించె వెలది పతిని. "

లాస్య మాడి నంత లలనకు లోనైన
హాస్య మన్న గాని దాస్య మనదు
భార్య యన్న నేమి భరియించు నది కాదు
వేశ్య కప్ప గించె వెలది పతిని.

10, ఆగస్టు 2010, మంగళవారం

సమస్య " హరుడు మోద మలర సిరిని వలచే "

హరిని గాంచి నంత మురిపించె సిరి గాన
కడలి దాటి యైన కదలి రాడ ?
వనిత వలచి నంత వదలడీశ్వరు డైన
హరుడు మోదమలర సిరిని వలచె

8, ఆగస్టు 2010, ఆదివారం

చింతా రామ కృష్ణా రావు గారి " కంద గీత గర్భ చంపక మాల

వరగుణ ధామమా!సుజన భావన దేలుచు శోభగూర్చి భా
గ్య రమయనన్ దగన్,మెలగు గౌరవ సన్నుత మేలు బంతివే
వర వినయాదులన్ ప్రతిభ భాగ్యవిధానము భవ్యమీరు గా
వర మణులై సదా వెలుగు పంచెడి చక్కని వేలుపీవె గా
కందము.
గుణధామా !సుజన భా
వన దేలుచు శోభ గూర్చి భాగ్య రమయనన్
వినయాదులన్ ప్రతిభ భా
గ్య విధానము భవ్య మీరు గా ! వరమణులై.
తేట గీతి
సుజన భావన దేలుచు శోభ గూర్చి
మెలగు గౌరవ సన్నుత మేలు బంతి
ప్రతిభ భాగ్య విధానము భవ్య మీరు
వెలుగు పంచెడి చక్కని వేలుపీవె

2, ఆగస్టు 2010, సోమవారం

సత్య భామను పెండ్లాడె శంకరుండు

భామ నీకింత సౌందర్య భాగ్య మేల
కాంత నీ వెంట వచ్చెద నెంత దవ్వు
చావు బ్రతు కైనా నీ తోటి స్వర్గ మనగ
సత్య భామను పెండ్లాడె శంకరుండు !
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase