టెస్ట్ ట్యూబ్ బేబీలంటే గుర్తొచ్చింది, అందుకే ఈ ఆర్టికల్ రాయాలనిపించింది. బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఐతే ఇంతకీ అసలు పూర్వ కాలంలో పురుషులు కూడా గర్భాన్ని ధరించి పిల్లల్ని కనేవారట. ఇప్పుడు ఆధునిక పరిశోధనలు జరిపి కృత్రిమ గర్భధారణ పద్ధతులు వచ్చాయి గానీ, మన పురాణ యుగంలోనే ఋషులు వేద మంత్రాలతో పుత్ర కామేష్టి వంటి యాగాలు చేసి సంతానోత్పత్తి చేసేవారన్నది జగద్వితమే. రామాయణ కథలో నాయకుడైన రాజు జననం అలాంటిదేనట. మహాభారతంలో కౌరవులు, పాండవులు, ద్రౌపది లాంటి వారి జననములు మరికొన్ని పద్ధతుల ద్వారా జరిగాయట. ఇక రాముడు, మొదలైన వారు మాతృమూర్తులకే జన్మించినా, అంతకు ముందు చాలా కాలంగా ఇక్ష్వాకు వంశం లోనే ఒక రాజు, తండ్రికి జన్మించాడట. అతడే "మాంధాత చక్రవర్తి". పూర్వం ఇక్ష్వాకు వంశంలోనే యవనాశ్వురుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకి వంద మంది భార్యలు ఉండేవారు. కానీ ఒక్కరికీ సంతానం కలుగలేదు. అలాగైతే వంశం అంతరించి పోతుందని దిగులు చెంది, నమ్మకస్తులైన మంత్రులకు రాజ్య భారాన్ని అప్పగించి, తన వంద మంది భార్యలను తీసుకుని మనశ్శాంతి కోసం యవనాశ్వురుడు అరణ్య వాసం చేద్దామని బయలుదేరాడు. అలా వెళ్ళిన కొద్ది రోజుల్లోనే దైవికంగానే అక్కడ అరణ్యంలో ఉన్న మునులు, రాజు మంచితనాన్ని గ్రహించి, అతడికి ఏ విధంగానైనా సాయపడాలని నిర్ణయించుకున్నారు. పుత్ర కామేష్టి యాగాన్ని జరిపించి అతనికి సంతానం కలిగేలా చేయాలనుకున్నారు. అందుకు రాజు చాలా సంతోషించాడు. వెంటనే అక్కడి మునులందరు కలసి దేవేంద్రుని ఉద్దేశించి పుత్ర కామేష్టి యాగం చేసారు. ఆ యాగంలో ఒక భాగంగానే, ఒక కలశం లో మంత్ర జలాన్ని సిద్ధం చేసి ఉంచారు. ఐతే ఆ కలశంలోని జలాన్ని మరునాడు ఉదయాన్నే యవనాశ్వురుడి మొదటి భార్య చేత తాగించాలని అనుకున్నారు. ఇక ఆ రాత్రికి ఎవరి నెలవులకు వారు వెళ్ళి నిద్రించారు. ఐతే ఎన్నడూ లేనిది రాజుకు అర్థరాత్రి వేళ విధి విలాసమా అన్నట్టు విపరీతమైన దాహం వేసింది. అందుకు వీళ్ళనీ, వాళ్ళనీ లేపి నీళ్ళడగటం ఎందుకని, రాజు తానే స్వయంగా లేచి ఇటూ అటూ వెదకసాగాడు. కొంచం దూరంగా నీళ్ళున్న కలశం కనుపించింది. అప్పుడు కలశంలోని నీరు తాగి దాహం తీర్చుకుని పడుకున్నాడు.మర్నాడు మునులు వచ్చి చూస్తే కలశం ఉంది గానీ నీళ్ళు లేవు. ఆరా తీసి అడిగితే రాజు తానే తాగానని చెప్పాడు. మునులు దైవ నిర్ణయంముగిసిన పిమ్మట ఎటు వారటు వెళ్ళిపోయారు.
కొంత కాలం గడిచేసరికి రాజు గర్భం ధరించి నెలలు నిండిన ఒక శుభ ముహుర్తాన అతడి పొట్ట కుడి వైపు భాగాన్ని చీల్చుకుని ఒక మగబిడ్డ జన్మించాడు. యవనాశ్వురుడు దైవానుగ్రహము వలన బిడ్డ పుట్టగానే మరణించి ముక్తి పొందాడు. కానీ పుట్టిన బిడ్డ తల్లి పాల కోసం విలవిలలాడుతుంటే, ఆ బాధ చూడలేని దేవేంద్రుడు తన అనుగ్రహము వలన పుట్టిన ఆ బిడ్డ దగ్గర కొచ్చి బిడ్డను ఓదారుస్తూ దైవ భాషలో (సంస్కృతం) "మాం ధాతా" (అంటే "ఓ బిడ్డా ఏడవకు నన్ను తాగు నన్ను తాగు" అన్నది ఆ మాటలకర్థం) అని అంటూ తన చూపుడు వేలుని ఆ బిడ్డ నోటికి అందించాడట. ఆ వేలు ద్వారా అమృతం స్రవించిందట. అలా పుట్టిన బిడ్డయే పెద్దవాడై "మాంధాత చక్రవర్తి" అయ్యాడట. అతడికి శతబిందు కుమార్తె బిందుమతితో వివాహమైయింది. వారికి "పురుక్సుతుడు, అంబరీషుడు, ముచి కుందురుడు" అనే ముగ్గురు మగ పిల్లలు, 50 మంది ఆడ పిల్లలు కలిగారట. ఇలా మాంధాత ఒక పురుషుడికి పుట్టిన బిడ్డగా, సప్త ద్వీపాలను ఏలిన ఒక చక్రవర్తి గా పురాణాలలో కనుపిస్తాడు. అంటే, ఇప్పటివలే సూదులు, కుట్లు, మందులు లేకుండానే మంత్రాలు, మంత్ర జలాలతోనే మన ఋషులు ఎన్నో అద్భుతాలు చేసే వారన్న సంగతిందువలన మనకు తేట తెల్లమౌతోంది .
5 కామెంట్‌లు:
మన పురాణాల లో కొన్ని నమ్మ శక్యము కాని ఉదంతాలు కనిపిస్తాయి. కానీ ఏ పుట్టలో ఏ పాముందో చెప్పలేము కదా?
"తన వంద మంది భార్యలను తీసుకుని మనశ్శాంతి కోసం యవనాశ్వురుడు అరణ్య వాసం చేద్దామని బయలుదేరాడు"
That is self-contradictory!!
సారీ అండీ, కథ బావుందిగానీ, పై వాక్యం చదవగానే నవ్వాపుకోలేకపోయాను.
భార్యలను తీసుకెళ్ళక పోతే మంత్ర జలాన్ని ఎవరికి వ్వాలి? ఐనా భార్యలు పక్కన లేక పోతే [ అందునా వంద మంది ] ఉన్న మనస్సాంతి కుడా పోతుంది మరి అదన్న మాట అసలు సంగతి
రాజేశ్వరి నేదునూరి గారూ...,శ్రీకరమైన వినాయక చతుర్థి సందర్భముగా తెలుగు బ్లాగరులందరికి శుభాకాంక్షలు
హారం
ఈ కధ ఇంతవరకూ వినలేదండి...ధన్యవాదాలు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి