Pages

30, జూన్ 2011, గురువారం

" మినీ కవితలు "

నాన్నమ్మ చచ్చి పోయిందని
బాబి గాడు బాగా ఏడ్చాడు
నాన్నమ్మ చచ్చి పోయి నందుక్కాదు
రాత్రికి తనెక్కడ పడుకోవాలని ?
-----------------------------
భార్య చని పోయినందుకు
బాధ గా లేదు
ఇక నుంచి ఒంటరి గా
ఎల్లా బ్రతకాలని ?

" శంకరునకు గలవు వంక లెన్నొ !

బూది పూత లకట ! పుర్రెలన్ గళమందు
సిగను చంద్ర వంక సొగసు గాను
మసన మందు దిరుగు మహనీయు డందురు
శంకరునకు గలవు వంక లెన్నొ !

" గాడిద యేడిచె గదన్న ఘన సంపన్న "

గాడిని దప్పిన కొమరుని
గాడిద కొడు కంచు తండ్రి ఘనముగ తిట్టన్
చూడుము బిడ్డా మనగతి
గాడిద యేడిచె గదన్న ఘన సంపన్నా !

21, జూన్ 2011, మంగళవారం

" కుటిలాలక యెడమ కన్ను కుడి కన్నాయెన్ "

కట కట యెంతటి ఘోరము
నిటలాక్షుని శిరము పైన నిలిచిన గంగన్ !
పటుతరమై వీక్షిం పగ
కుటి లాలక యెడమ కన్ను కుడి కన్నాయెన్ !

20, జూన్ 2011, సోమవారం

" బొంకి నాడు హరిశ్చంద్ర భూవరుండు "

మాట నిలుపుట కెటులైన మనసు మార్చి
దార నమ్ముట కేరీతి బేర మాడి
భోగ భాగ్యాలు విడనాడ బోననంగ
బొంకి నాడు హరిశ్చంద్ర భూవరుండు. !

" కప్పను జూడంగ బాము గడగడ వడకెన్ "

కప్పలు కుప్పలు కుప్పలు
మెప్పుగ వాల్మీకము చుట్టు మెలగుచు మ్రోయన్ !
చప్పున పైకెగసి వినగ
కప్పను జూడంగ బాము గడ గడ వడ కెన్ !

14, జూన్ 2011, మంగళవారం

" చోరుని గని సంతసించి సుందరి పిలిచెన్ "

తారా పధమున నిలిచిన
వీరాగ్రేసరుని గాంచి పెండిలి యాడన్ !
గారమున కులుకు మానస
చోరుని గని సంతసించి సుందరి పిలిచెన్ !

12, జూన్ 2011, ఆదివారం

" భామా కుఛ మండలంబు భస్మం బాయెన్ !

లేమా నీ లేత యందము
ప్రేరితమై పరితపింప పెండిలి యాడన్ !
కామాంధుడు కనుగానక
భామా కుఛ మండలంబు భస్మం బాయెన్ !

11, జూన్ 2011, శనివారం

" చీమ కుట్టగ జచ్చెను సింహ బలుడు. "

దోమ కాటుకు బలియైన దొరలు కలరు
తేలు విషమెక్కి మరణించు తీరు తెలుసు
విషపు కన్యను ముద్దాడ విటుడు జచ్చె
చీమ కుట్ట గ జచ్చెను సింహ బలుడు.

7, జూన్ 2011, మంగళవారం

" కల్ల లాడు వారె కవులు గాదె ! "

కవుల యుల్లమందు కల్లల నిధి యుండు
కలము కదిపి నంత గలుగు వింత
కల్ల లెన్నొ మదిని కురిపించి మురిపింప
కల్ల లాడు వారె కవులు గాదె !
-----------------------------------
నేతి బీర కాయ నేయుండ దిసుమంత
ఏత మేసి తోడ యేరు ఇగుర
పొగిలి పొగిలి యేడ్చి పొంత నిడదు గాన
కల్ల లాడు వారె కవులు గాదె !
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase