Pages

22, జులై 2010, గురువారం

సమస్య " ధనమే గొప్ప మంచి తనము కంటే "

మంచి మంచి యన్న మనుగడ యేముంది
కంచి కేగునట్టి కతల కతన
వేంకటేశు డైన వినడు ముడుపులేక
ధనమె గొప్ప మంచి తనము కంటె
....... ......... .......................
.సమస్య " వేళ గాని వేళ బిలువ దగునె "
బాసు పిలిచె నంత బలిమిగ నిశిరాత్రి
వళ్ళు మండి భార్య గొళ్ళె మేసె
తిరిగి వచ్చి నంత తెరువదు తలుపెంత
వేళ గాని వేళ బిలువ దగునె ?
...... ......... ......
సమస్య " రాదా ఇటు రమ్మటంచు రాముడు పిలిచెన్ !
బంధించకె ప్రియ సఖి నను
సాధారణ దోషమునకు చంపెద వేలా ?
నాదగు హృదయము నీదిక
రాధా ఇటు రమ్మటంచు రాముడు పిలిచెన్

19, జులై 2010, సోమవారం

దూరపు కొండలు

దూరపు కొండలు నునుపు అన్న నానుడి అందరికి తెలిసిందే, అందుకే దగ్గరగా వెళ్ళి అవి నునుపో, గరుకో తెలుసుకోవాలన్న తాపత్రయం చాలా మందికి ముఖ్యంగా మన భారతీయుల్లో విపరీతంగా పెరిగి పోతోందంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా చోట్ల ముఖ్యంగా న్యూజెర్సీ లో ఎక్కడ చూసినా భారతీయులే నుపిస్తూ ఉంటారు. అంతే కాదు మన ఇండియన్ రెస్టారెంట్లు, ఇండియన్ గ్రోసరీలు అదే మన సరుకులు, కూరలు, రకరకాల ఆహార పదార్ధాలు (వండిన కూరలు, పిండి వంటలు, రుబ్బిన పిండిలు ఇలా ఏవైనా) రెడీ మేడ్ గా అన్ని దొరుకుతాయి. డబ్బుండాలే గాని ఇక్కడ పుట్టింటిని రెట్టించిన సుఖం. ఒక్క ఆహార విషయమే కాదు ఇండియన్ మేడ్ ఏదైనా (డ్రస్సులు లాంటివి) రెండింతలు లాభమే. కొంచం కష్టపడి అక్కడ నుంచి తెచ్చి బిజినెస్ చేయగలిగితే డాలర్ల బారిష్. అంతే కాదు చాలామంది ఇంట్లొనే ఉండే వారు రకరకాల వంట కాలను తయారు చేసి ఉద్యోగినులకు అందుబాటుగా అమ్మి శ్రమతప్పిస్తారు. కొంచం ఖరీదనిపించినా ఆఫీసునుంచి ఇంటికి వెడుతూనే దారిలో తీసుకుని వెళ్ళి పోతారు అంటే ఇటు ఇంట్లో ఉండే వారికి ఆర్థిక ఇబ్బంది ఉండదు అటు ఉద్యోగినులకి శ్రమ తప్పుతుంది. ఐతే ఇంతకీ అసలు చిక్కు ఏమిటంటే ఐన వాళ్ళ ద్వారానో ఆనోటా ఆనోటా వినో టివీలు చూసో చాలామంది "హబ్బ! ఎలాగోలాగ అమెరికా జేరిపోతే బోలెడు డబ్బు సంపాదించుకోవచ్చును" అనుకుని కొందరు, వృత్తి రీత్యా కొందరు నాగరికత పేరుతో మరి కొందరు విదేశీయ వ్యామొహం వలన ఇంకొందరు ఏదో రీతిగా అమెరికా జేరిపోవాలన్న తాపత్రయం. ఉద్యోగ రీత్యా వచ్చిన వాళ్ళకి కొంత ఫర్వాలేదు గానీ ఏదో రకంగా వచ్చిన వాళ్ళకి స్నేహితులు గానీ ఐన వాళ్ళు గానీ లేక పోతే చాలా కష్టం. సమ్మరైతే కొంత ఫర్వాలేదు గానీ చలి కాలం ఐతే మాత్రం కోట్లు జాకెట్లు లేకుండా విమానాశ్రయం దాటి బయటకు రావడమే అతి కష్టం. వీసా దొరికింది గదా అని విమానం ఎక్కితే గగనయానం ఎంత విసుగో తీరా వచ్చాక కొందరికి రోజు గవడం అంత గగనం. ఎందుకంటే ఇక్కడ స్టాటస్ లేకుండా ఉద్యోగాలు రావు. దొంగతనంగా చేసినా పట్టుబడితే ఇంతే సంగతులు. కొన్ని ఏళ్ళుగా పనిచేస్తున్న వారికైనా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియదు అంతే గాక ఏ చిన్న పొరబాటు చేసినా పనిష్మెంట్ ఉంటుంది. కారు మామూలు కంటే స్పీడుగా వెళ్ళినా టికెట్ ఇస్తాడు మర్నాడు కోర్టుకి వెళ్ళి పెనాలిటీ కట్టాలి.
ఇక అమెరికా సంబంధాలు చేసుకుంటే ఈ చుట్టాలు సాంప్రదాయాలు చాకిరీలు ముఖ్యంగా అత్త మామల గోల, ఆడబిడ్డల అదలింపులు లాంటివి ఏమి ఉండవు హాయిగా స్వేచ్చా విహంగాల్లా ఎగిరి పోవాలని కలలు కనే అమ్మాయిలు, వారి తల్లి దండ్రులు "ఓ లక్ష ఎక్కువే ఐనా విదేశీయ వివాహాలకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందులొ ఎన్ని నిజం? ఎన్ని మోసం? అది తర్వాతి సంగతి అమెరికా వెళ్ళి పోతామన్న అహంతో అత్తింట్లో అడుగిడిన కొత్త కోడళ్ళు పుట్టింట్లో అంతవరకు అమ్మకు కుడిభుజంగా బండ చాకిరీ చేసి అలసి పోయి అత్తగారికి ఇంటి పనిలోను వంట పనిలోను సాయపడడానికి పాపం వళ్ళు వంచలేక చీపురు ముట్టుకోవాలన్నా, గిన్నెలు కడగాలన్నా నామోషీ నటిస్తూ, అలాటి పన్లేమీ తెలియనట్టు అసలు చేత కానట్టు వంద మెలికలు తిరిగి పెద్ద బిల్డప్ లు ఇస్తూ ఉంటారు. ఐతే అలా మెలికలు తిరిగిన ఆ కోడలు నిజంగా అమెరికా వచ్చాక రోజూ గిన్నెలు తోముకోవాలి. పెద్ద పెద్ద చీపుళ్ళు (మన రోడ్లూడిచేలాంటివి) తీసుకుని గ్యారేజిలు ఇంటి ముందు రాలిన చెట్ల ఆకులు ఇంట్లో ఉడ్వర్క్ ఐతే గదులు అన్నీ ఊడ్చు కోవాలి వారానికి రెండు సార్లు చెత్త వాడికి ఇంటి ముందు ఇంట్లో చెత్త అంతా వేసి (బాత్రూముల్లో టిష్యూల దగ్గరనుంచీ) చెత్త డబ్బా డ్రైవే ముందు పెట్టాలి కార్పెట్ ఐతే కనీసం వారానికోసారి వ్యాక్యూం చేసుకోవాలి. మరీ డబ్బున్న వాళైతే క్లీనింగ్ లేడీని పిలుచుకుంటారు. ఇంటిని బట్టి 80, 100, 150 డాలర్లు తీసుకుంటారు. ఇక మంచు పడితే ఇంటి ముందు పెద్ద పెద్ద పారల్తో కనీసం పాత్ వే డ్రైవే క్లీన్ చేయాలి మనింటి కొచ్చిన వాళెవరైనా (పోస్ట్ మాన్ లాంటి వాళ్ళు) మంచుకి జారి పడితే పెనాల్టీ మనకే. ఇక్కడ ఎవరి పన్లు వాళ్ళే చేసుకోవాలి. ఎవరి డబ్బు వారే సంపాదించు కోవాలి. అందుకే పిల్లలకి 18 ఏళ్ళు దాటితే ఎవరికి వారే స్వతంత్రులు. వారికి తల్లి దండ్రుల పంచన ఉండటం నామోషీ. అందుకే కాలేజీ చదువు నుంచే పార్టైం జాబ్ చేస్తూ ఉంటారు. పిజ్జా డెలివరీలు మాల్ బిల్లింగులు రెస్టా రెంట్లలోను లేదా డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర వారి వారి చదువుని బట్టి ఇష్టాన్ని బట్టి పన్లు చేసి సంపాదించుకుంటారు. గాళ్ ఫ్రెండ్ బోయి ఫ్రెండ్ అని కలిసి మెలిసి స్వేచ్చగ తిరుగుతూ హాయిగా ఉంటారు. పెళ్ళి చేసుకున్నా ఎప్పుడు నచ్చక పోతే అఫ్ఫుడే విడిపోతారు. మన లాగా జీవితాంతం ఒకే భార్య ఒకే భర్త అదే పిల్లలు కలిసి ఉండరు. విడిపోయినప్పుడు పిల్లల్ని ఎవరికి నచ్చితే వాళ్ళే ఉంచుకుంటారు. నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలు అన్నట్లు తల్లి వేరు తండ్రి వేరు ఐన పిల్లలు "హాఫ్ బ్రదర్ హాఫ్ సిస్టర్ స్టెప్ మదర్ స్టెప్ ఫాదర్" అనుకుంటూ కలిసి మెలిసి ఉంటారు ఏదైనా 18 ది వచ్చేవరకే. అందుకే స్కూల్లో చిన్నప్పట్నుంచీ స్వతంత్ర భావాలు స్వతంత్ర జీవనం నేర్పుతారు. ఇంతకీ అసలు చిక్కేమిటంటే ఇండియానుంచి వచ్చి ఎల్ కెజీ నుంచి ఇక్కడే చదువుకున్న పిల్లలు అలాగే జీవించాలనుకోవడం అవే భావాలు ఎవరినీ లెక్క చేయకపోవడం అవే అలవాట్లు "మాకిదే తెలుసు దీనికే అలవాటు పడ్డాం ఇప్పుడు కొత్తగా మీరేం చెప్పినా మాకలవాటు లేదుకదా !" అని ఎదురు తిరగడంతో ఇక్కడ స్థిర పడిన భారతీయులు కొందరికి ముఖ్యంగా అమ్మాయిలున్న వాళ్ళకి అరగట్లేదు కొరుకుడు పడక కొందరు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇండియా వెళ్ళి పోతున్నారు ఇప్పుడు చెప్పండి ఇలా తరచి చూస్తే దూరపు కొండలు నునుపో గరుకో ?

ఆ గొప్పతనం ఎందరికి తెలుసు ?

"చీర ఒంటికి బరువైందా?" అంటే ఎంత వెర్రి ప్రశ్న? బరువు గాక తేలిక ఎలా అవుతుంది? ఈ ఆధునిక యుగంలో ఆరు గజాల చీర నుంచి అరగజం ముక్క చొప్పున తీస్తే, డజను డ్రస్సులు కుట్టించుకోవచ్చును. అప్పుడు బరువైన చీర ఎంత ఉపయోగమో, తేలికైన డ్రస్సు అంత అందం కదూ అనుకునే ఈ అణుయుగంలో అమ్మాయిలు, సులభమైన ఇటువంటి భావాలతో, అసభ్యకరమైన అందచందాలను ప్రదర్శించటానికీ, పరువు ప్రతిష్టలను మంట గలపడానికీ, మగవారిని రెచ్చ గొట్టడానికే అన్నట్టుంది వారి వేషధారణ. "ఛ ఛ! నాన్ సెన్స్! చీర ఎంత మోటుతనం? ఓల్డ్ బగ్స్ కట్టుకునే బి సి తనం" అని హేళన చేసే యువతరం, ఎంతగానో ఎదిగిన నవనాగరికతా వ్యామోహంలో మభ్యపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. నుదుట బొట్టు మానుకుని జానెడు జుట్టు విర బోసుకుని గృహిణులైతే పుస్తెలు, నల్ల పూసలు దాచేసి గజం బట్టతో అవసరమైన చోట్ల కప్పుకుని వీధుల్లో, కాలేజీల్లో అఫీసుల్లో నడుస్తూ వినువీధుల ఊహల్లో పయనిస్తు "హాయి హూయి మాం డాడ్" అనుకుంటూ తెలుగుదనాన్ని చీడ పట్టించే ఈ అధునిక సమాజంలో చీర పేరు చీర గొప్ప తనం ఎందరికి తెల్సు? ఒకవేళ తెలిసిన వాళ్ళు మాట్లాడినా, అది వినడనికి ఇబ్బంది నటిస్తూ చాదస్తపు కబుర్లు కట్టి పెట్టమన్నట్టు వ్యంగ్య ధోరణిలో, నిర్లక్ష్యపు చూపులు విసిరి కించపరచి, గేలి చేయడం ఈ అణుయుగపు అమ్మాయిలకు ఒక అలవాటు. శుభకార్యాలలో పట్టు చీరెల రెపరెపలు, వాలుజడల విసుర్లు, మల్లెల సౌరభాలు, నుదుట కుంకుమ తళతళలు, కాటుక కన్నుల అందమైన మిలమిలలు, ఇవన్నీ కవులు వర్ణించే స్త్రీల అందచందాలు. అంతే కానీ నడుంకి క్రింద భాగం, పైభాగం అరగజం ముక్కలతో అతుకు బెట్టి మిగిలిన శరీరమంతా వెన్నెలలా ఆరబెడితే కవులు వర్ణించ లేరు సరికదా కళ్ళతో బాటు కలాలు కుడా మూసుకోవలసిందే. కుర్ర కారుకి కన్నుల విందే కానీ పెద్దలకి కంఠశోష. మిగిలిన పెద్దముత్తైదువలు, నచ్చని వాళ్ళు సిగ్గుతో కుంచించుకు పోవలసిందే. ఇక అలా చూసి వెర్రెక్కిన కుర్ర కారు నేల మీద ఆనరు సరి కదా? అందుకే లైంగిక వేధింపులు కట్టలు తెంచుకున్నాయి. అసలు కాలి పసుపు దగ్గరనుంచి నుదుట బొట్టు వరకు పాదాల నాదాలవరకు మాంగల్యపు చిరు సవ్వడి వరకు మన కట్టూ బొట్టు సంస్కృతి సాంప్రదాయాల గురించి అనేక రకాలుగా ఒక్కొక్కదానికి ఒక్కొక్క నిర్వచనం చెప్తారు. అవి భర్తకి ఏ విధంగా ఆయుః ప్రమాణాన్ని పెంచుతాయో, వ్యక్తిత్వ వికాశాన్ని కలిగిస్తాయో వివరించి చెప్పాయి మన పురాణాలు. అందుకే భర్త లేని వారికి ఆ అలంకరణలు తీసి వేయడం ఒక ఆచారం. అంతే కానీ నేటి ఆధునికపు అవతారాలు స్త్రీని నవ్వుల పాలు చేయటమే గాక గౌరవాభి మానాలు నసింప చేసేవిగా ఉండడం శోచనీయం.
నాగరికతా వ్యామోహంలో విదేశీయ అనుకరణలో మన సంస్కృతీ సాంప్రదాయాలు పరిహసింపబడుతున్నాయంటే తల దించుకోవాల్సిన విషయం. స్త్రీ అంటే నిండైన చీర, అందమైన అలంకరణ ఒయినము, ఒందనము, మాటతీరు, మంచి నడవడిక అవన్నీ అమ్మగా భార్యగా దేవతగా మంచి గుర్తింపు నిస్తాయి. అసలు మనిషి గా పుట్టటం ఒక గొప్ప వరం. అందునా స్త్రీగా మరింత అద్భుతమైన వరం. తల్లిగా, చెల్లిగా, భార్యగా అందరి ఎందరి హృదయాలనో రంజింపజేయగల సమర్ధత ఒక స్త్రీత్వానికే ఉంది. ఇక ఓర్పు నేర్పు దయ క్షమ స్త్రీల సొంతం. మీ కోడలు లక్ష్మీ దేవిలా ఉంది, ఆ ఇంటి ఇల్లాలు లక్ష్మీ దేవిలా కళ కళలాడు తోంది అనడం పరిపాటి. ఐతే వీటన్నటికీ అతీతంగా వచ్చిన పెద్ద మార్పు సమాన హక్కుల పేరుతో సంపాదించుకున్న అంటువ్యాధి. అవునూ నిజానికి సమానం కానిదెప్పుడు? స్త్రీని అనాదినుంచే దేవతగా ఆరాధిస్తూనే ఉన్నారు, గౌరవిస్తూనే ఉన్నారు. మనమే నేల విడిచిన సాములా, చీర విడిచి చింపిరి గుడ్డల్లో ఒళ్ళు కప్పుకుని చిల్లరగా కనిపించి మిడ్డీలు చెడ్డీలు వేసుకుని ఇచ్చిన గౌరవాన్ని మంట గలిపి రెచ్చగొడుతున్నది అన్నిటా సమానత్వం కోరుకోటమా? మరి అవేనా సమాన హక్కులు? ఇంటిపనీ ఒంటపనీ ఇలా ! అసలు సృస్టిలోనే స్త్రీ పురుషుల మధ్య ఎంతో భేధం ఉంది కదా? ఎన్ని సాధిస్తే మాత్రం సమానం కాగలం? పోనీ అదలా ఉంచితే అన్ని రంగాలలోను నేడు స్త్రీలు ముందడుగు వేసి ప్రగతి సాధించారు. బయటి ప్రపంచంలో తిరుగుతున్నారు. అటువంటప్పుడు నలుగురికీ ఒళ్ళు విరుచుకోకుండా అదే బిగువైన టీ షర్టులు, మరింత బిగువైన పాంట్లు వేసుకుని కనబడకుండా మన భారతీయతకు తగిన విధంగా కట్టు బొట్టు సాంప్రదాయ బద్ధంగా ఉండటం ముదావహం. స్త్రీ అంటే చూడగానే అందమైన చీరలో కనువిందు చేసే అలంకరణలో అందంగా హుందాగా ఉండాలి. ఇతర దేశాలు ఎంతగానో మెచ్చుకునే మన సంస్కృతీ సాంప్రదాయాలను మనమే విడనాడి విదేశీయ అనుకరణతో హాస్యాస్పదం కావడం విచారించ తగ్గ విషయం. నాగరికత పేరుతో పర భాషా వ్యామోహాన్ని మనకి సరిపడని అసభ్యపు వస్త్ర ధారణని విడనాడితే అందరికి ఆనందం. నేడు పసివారు సైతం [టీవీలు సినిమాలు చూసి] అమ్మ అంటే మిడ్డీలు చెడ్డీలు అనుకునేలా ఉన్నారు. అమ్మ అంటే అర్ధనగ్నం కాదని గ్రహించాలి. అప్పుడే అమ్మదనంలోని కమ్మదనం అనుభూతి కలుగుతాయి. ఆప్యాయత, రాగాలు అన్నిటికీ అతీతమే. నిజంగా జన్మంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ స్త్రీ గానే పుట్టాలి అందునా అందమైన అమ్మాయి గా పుట్టాలి, మరింత అందమైన పట్టు చీరలు కట్టుకుని పెద్ద వాలు జడతో మల్లెల సౌరభాలతో అందెల రవళులతో గాజుల గల గలలతో మెట్టల చిరు సవ్వడితో మాంగల్యపు వీనుల విందైన సన్నని ధ్వని తరంగాలతో ఎదుటి వ్యక్తి హృదయాన్ని ఝల్లు మనిపించేలా, "మగువేగా మగవానికి మధుర భావన" అన్నట్టు మృదుమధురమైన స్మృతి గా మిగిలి పోవాలి. అది ఒక్క చీర కే సాధ్యం

17, జులై 2010, శనివారం

సమస్యా పూరణలు

కలిమి యున్నంత కాలమ్ము కపటమైన ప్రేమ
చెలిమి చేయంగ వత్తురు చెరువు నిండ
బలిమి లేనట్టి తరుణమ్ము బదులు రాక
కలిమి యెడబాసి నప్పుడె కలుగు సుఖము
...... ....... ..... ........ ...........
చూపు కలిసి నంత చక్కన్ని చుక్కను
పెండ్లి యాడ గోరి పిచ్చినాకు
చూపు కలవకుండ చేపట్టె నొకచుక్క
సెంటి మెంటు చేసె సెటిలుమెంటు.
....... ......... ........ ..........
తండ్రి పేరు జెప్పి తనయుండు వెడలంగ
బలిమిలేదు గాని కలిమి గలదు
పైసలున్న చాలు పరమాత్మ దిగిరాడె
పేరు లేని వాడె పేర్మి గనెను

15, జులై 2010, గురువారం

బండ రాయని తెలిసియు బదులు రాక
గుండె నిండుగ నాశలు మెండు గాను
మండు టెండను నడచుట మరచి పోయి
కుంటి వాడెక్కె తిరుమల కొండ పైకి
......... ......... ........
.అర చేతను స్వర్గ ముందని
చెర బట్టుకు బడుగు జనుల చేకొని పోవన్
తెర పడదు కుటిలమున కర
మరలెఱుగని నియంతలు గన మాన్త్రికులేగా
[ దత్త పది = అర , చేర , తెర , మర ]

14, జులై 2010, బుధవారం

వాన ముచ్చట్లు

దినమంతా దివాకరుని కోపాగ్నికి మాడిన భూమాత కరుణించిన వరుణదేవుని చల్లని చిరు జల్లులకి పులకించి పరవసించి వెద జల్లే కమ్మని పరిమళాలు ఏ పూలకైనా ఉంటే ఎంత బాగుండును ?ఆ మట్టి వాసన ఆశ్వాదించాలే తప్ప వర్ణనా తీతం .ఇక చిన్న నాటి అనుభవాలు వర్షంలొ తడుస్తు కాగితం పడవలు వేస్తు అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు తిట్టిన కొద్దీ మరింత పరుగులు పెడ్తు అదొక తీయని స్మృతి మరి ఓణీలు చీరలు నును సిగ్గుల దొంతరలు ఒలికిస్తు హైస్కూలుకి కాలేజీలకీ ఒకచేత్తో ఒయ్యారంగా పుస్త కాలు మరొక చేత్తొ కుచ్చెళ్ళు ఒడిసి పట్టుకుని ఎత్తెత్తి అడుగులు వేసుకుంటు తడిసిన బట్టల్లో దాచ లేని అందాలని విశ్వ ప్రయత్నం చేస్తు వాటిని కన్నులతో తాగే పురుష పుంగవులను తప్పించు కుంటు తడిసిన వాలు జడలను విరిసి సువాసనలను వెద జల్లే పూల దండలను సవరించు కుంటు వాలు చూపులు విసురుతు కించిత్ గర్వం గా హంస నడకలు .అదొక అందమైన అనుభూతి ఇక ఆఫీసులు ఉద్యోగాలు ఎక్కే బస్సు దిగే బస్సు ఇదే పరిస్తితి ఐనా కాస్త మోతాదు ఎక్కువ మరి శ్రీ వారితొ సినిమాకో షికారుకో స్కూటరు మీద వెళ్ళా మనుకోండి అప్పుడు " చిట పట చినుకులు పడుతూ ఉంటే " అన్నట్టు ఏముందీ ? బొత్తిగా శ్రీవారి భుజం మీద వొరిగి పోయి మన గతుకుల రోడ్ల పుణ్యమా అని మరింత అతుక్కు పోవడమే ఇల్లు జేరేసరికి ఏముంది ? ఆరిన బట్టలు మిగిలిన మధురమైన అనుభవాల అనుభూతులు ఇక కార్లొ వెళ్ళా మంకోండి మనం తడవక పోయినా తడిసి వెడుతున్న వాహనాలు పరుగులు పెడుతున్న జనాలు నీటిని తుడుస్తున్న వైఫర్లు వినిపించె సన్నని సంగీతం స్టీరింగు ముందున్న శ్రీ వారికి మరింత దగ్గరగా అతుక్కు పోయి చలి కాచు కోవడం ఇలా చెప్పుకుంటూ పోతే చదివే ఓపిక ఉండాలే గానీ తీయని భావ పరం పరలు కోకొల్లలు. ఏమో బాబు నాకైతే అన్నిటికన్న " స్కూటరు అనుభూతులే అత్యంత ప్రీతి కరం.

13, జులై 2010, మంగళవారం

దత్త పది

అక్క , ఆన్న , చెల్లి , బావ

దత్త పది

గౌరవ నీయు లైన సాహితీ మిత్రులకు
అక్క , ఆన్న , చెల్లి , బావ
ఈ పదములను ఉపయోగించి తమకు నచ్చిన చందస్సులో " కందము . ఆట వెలది , తేట గీతి " ఏదైనా రామాయణ మునకు సంభందించిన అర్ధములో " వ్రాయ గలరు

11, జులై 2010, ఆదివారం

దత్త పది

హరిణ గతి రగడ

హిమము కురిసెడు ఋతువు ఇప్పుడు
సుమము విరియగ చూడ నిప్పుడు
ద్యుమణి వేడియు దూర మిపుడు
ద్రుమములకు పెడ రూపమిప్పుదు
ఇది జే.కే . మోహన్ రావుగారి రచన నాకు ఈ పద్యం చాలా ఇష్టం అందుకని ఇలా ఇక్కడ

10, జులై 2010, శనివారం

సమస్యా పూరణ

జంకు గొంకు లేక జలసూకరమ్ములు
తప్పు జేయ నెంచ తప్పు కాదు
లంచ మిచ్చి శరణు లలితమ్మకునుమొక్కి
బొంకి నట్టి వాడె పుణ్య జనుడు

8, జులై 2010, గురువారం

సమస్యా పూరణ

హెచ్చిన ధరలను కనుగొని
విచ్చేసెను గుండె పోటు విపరీతము గన్
నచ్చినది తినగ నోచక
పచ్చడి మెతుకులె మనకిక పరమాన్నమయెన్
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase