Pages

19, జులై 2010, సోమవారం

దూరపు కొండలు

దూరపు కొండలు నునుపు అన్న నానుడి అందరికి తెలిసిందే, అందుకే దగ్గరగా వెళ్ళి అవి నునుపో, గరుకో తెలుసుకోవాలన్న తాపత్రయం చాలా మందికి ముఖ్యంగా మన భారతీయుల్లో విపరీతంగా పెరిగి పోతోందంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా చోట్ల ముఖ్యంగా న్యూజెర్సీ లో ఎక్కడ చూసినా భారతీయులే నుపిస్తూ ఉంటారు. అంతే కాదు మన ఇండియన్ రెస్టారెంట్లు, ఇండియన్ గ్రోసరీలు అదే మన సరుకులు, కూరలు, రకరకాల ఆహార పదార్ధాలు (వండిన కూరలు, పిండి వంటలు, రుబ్బిన పిండిలు ఇలా ఏవైనా) రెడీ మేడ్ గా అన్ని దొరుకుతాయి. డబ్బుండాలే గాని ఇక్కడ పుట్టింటిని రెట్టించిన సుఖం. ఒక్క ఆహార విషయమే కాదు ఇండియన్ మేడ్ ఏదైనా (డ్రస్సులు లాంటివి) రెండింతలు లాభమే. కొంచం కష్టపడి అక్కడ నుంచి తెచ్చి బిజినెస్ చేయగలిగితే డాలర్ల బారిష్. అంతే కాదు చాలామంది ఇంట్లొనే ఉండే వారు రకరకాల వంట కాలను తయారు చేసి ఉద్యోగినులకు అందుబాటుగా అమ్మి శ్రమతప్పిస్తారు. కొంచం ఖరీదనిపించినా ఆఫీసునుంచి ఇంటికి వెడుతూనే దారిలో తీసుకుని వెళ్ళి పోతారు అంటే ఇటు ఇంట్లో ఉండే వారికి ఆర్థిక ఇబ్బంది ఉండదు అటు ఉద్యోగినులకి శ్రమ తప్పుతుంది. ఐతే ఇంతకీ అసలు చిక్కు ఏమిటంటే ఐన వాళ్ళ ద్వారానో ఆనోటా ఆనోటా వినో టివీలు చూసో చాలామంది "హబ్బ! ఎలాగోలాగ అమెరికా జేరిపోతే బోలెడు డబ్బు సంపాదించుకోవచ్చును" అనుకుని కొందరు, వృత్తి రీత్యా కొందరు నాగరికత పేరుతో మరి కొందరు విదేశీయ వ్యామొహం వలన ఇంకొందరు ఏదో రీతిగా అమెరికా జేరిపోవాలన్న తాపత్రయం. ఉద్యోగ రీత్యా వచ్చిన వాళ్ళకి కొంత ఫర్వాలేదు గానీ ఏదో రకంగా వచ్చిన వాళ్ళకి స్నేహితులు గానీ ఐన వాళ్ళు గానీ లేక పోతే చాలా కష్టం. సమ్మరైతే కొంత ఫర్వాలేదు గానీ చలి కాలం ఐతే మాత్రం కోట్లు జాకెట్లు లేకుండా విమానాశ్రయం దాటి బయటకు రావడమే అతి కష్టం. వీసా దొరికింది గదా అని విమానం ఎక్కితే గగనయానం ఎంత విసుగో తీరా వచ్చాక కొందరికి రోజు గవడం అంత గగనం. ఎందుకంటే ఇక్కడ స్టాటస్ లేకుండా ఉద్యోగాలు రావు. దొంగతనంగా చేసినా పట్టుబడితే ఇంతే సంగతులు. కొన్ని ఏళ్ళుగా పనిచేస్తున్న వారికైనా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియదు అంతే గాక ఏ చిన్న పొరబాటు చేసినా పనిష్మెంట్ ఉంటుంది. కారు మామూలు కంటే స్పీడుగా వెళ్ళినా టికెట్ ఇస్తాడు మర్నాడు కోర్టుకి వెళ్ళి పెనాలిటీ కట్టాలి.
ఇక అమెరికా సంబంధాలు చేసుకుంటే ఈ చుట్టాలు సాంప్రదాయాలు చాకిరీలు ముఖ్యంగా అత్త మామల గోల, ఆడబిడ్డల అదలింపులు లాంటివి ఏమి ఉండవు హాయిగా స్వేచ్చా విహంగాల్లా ఎగిరి పోవాలని కలలు కనే అమ్మాయిలు, వారి తల్లి దండ్రులు "ఓ లక్ష ఎక్కువే ఐనా విదేశీయ వివాహాలకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందులొ ఎన్ని నిజం? ఎన్ని మోసం? అది తర్వాతి సంగతి అమెరికా వెళ్ళి పోతామన్న అహంతో అత్తింట్లో అడుగిడిన కొత్త కోడళ్ళు పుట్టింట్లో అంతవరకు అమ్మకు కుడిభుజంగా బండ చాకిరీ చేసి అలసి పోయి అత్తగారికి ఇంటి పనిలోను వంట పనిలోను సాయపడడానికి పాపం వళ్ళు వంచలేక చీపురు ముట్టుకోవాలన్నా, గిన్నెలు కడగాలన్నా నామోషీ నటిస్తూ, అలాటి పన్లేమీ తెలియనట్టు అసలు చేత కానట్టు వంద మెలికలు తిరిగి పెద్ద బిల్డప్ లు ఇస్తూ ఉంటారు. ఐతే అలా మెలికలు తిరిగిన ఆ కోడలు నిజంగా అమెరికా వచ్చాక రోజూ గిన్నెలు తోముకోవాలి. పెద్ద పెద్ద చీపుళ్ళు (మన రోడ్లూడిచేలాంటివి) తీసుకుని గ్యారేజిలు ఇంటి ముందు రాలిన చెట్ల ఆకులు ఇంట్లో ఉడ్వర్క్ ఐతే గదులు అన్నీ ఊడ్చు కోవాలి వారానికి రెండు సార్లు చెత్త వాడికి ఇంటి ముందు ఇంట్లో చెత్త అంతా వేసి (బాత్రూముల్లో టిష్యూల దగ్గరనుంచీ) చెత్త డబ్బా డ్రైవే ముందు పెట్టాలి కార్పెట్ ఐతే కనీసం వారానికోసారి వ్యాక్యూం చేసుకోవాలి. మరీ డబ్బున్న వాళైతే క్లీనింగ్ లేడీని పిలుచుకుంటారు. ఇంటిని బట్టి 80, 100, 150 డాలర్లు తీసుకుంటారు. ఇక మంచు పడితే ఇంటి ముందు పెద్ద పెద్ద పారల్తో కనీసం పాత్ వే డ్రైవే క్లీన్ చేయాలి మనింటి కొచ్చిన వాళెవరైనా (పోస్ట్ మాన్ లాంటి వాళ్ళు) మంచుకి జారి పడితే పెనాల్టీ మనకే. ఇక్కడ ఎవరి పన్లు వాళ్ళే చేసుకోవాలి. ఎవరి డబ్బు వారే సంపాదించు కోవాలి. అందుకే పిల్లలకి 18 ఏళ్ళు దాటితే ఎవరికి వారే స్వతంత్రులు. వారికి తల్లి దండ్రుల పంచన ఉండటం నామోషీ. అందుకే కాలేజీ చదువు నుంచే పార్టైం జాబ్ చేస్తూ ఉంటారు. పిజ్జా డెలివరీలు మాల్ బిల్లింగులు రెస్టా రెంట్లలోను లేదా డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర వారి వారి చదువుని బట్టి ఇష్టాన్ని బట్టి పన్లు చేసి సంపాదించుకుంటారు. గాళ్ ఫ్రెండ్ బోయి ఫ్రెండ్ అని కలిసి మెలిసి స్వేచ్చగ తిరుగుతూ హాయిగా ఉంటారు. పెళ్ళి చేసుకున్నా ఎప్పుడు నచ్చక పోతే అఫ్ఫుడే విడిపోతారు. మన లాగా జీవితాంతం ఒకే భార్య ఒకే భర్త అదే పిల్లలు కలిసి ఉండరు. విడిపోయినప్పుడు పిల్లల్ని ఎవరికి నచ్చితే వాళ్ళే ఉంచుకుంటారు. నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలు అన్నట్లు తల్లి వేరు తండ్రి వేరు ఐన పిల్లలు "హాఫ్ బ్రదర్ హాఫ్ సిస్టర్ స్టెప్ మదర్ స్టెప్ ఫాదర్" అనుకుంటూ కలిసి మెలిసి ఉంటారు ఏదైనా 18 ది వచ్చేవరకే. అందుకే స్కూల్లో చిన్నప్పట్నుంచీ స్వతంత్ర భావాలు స్వతంత్ర జీవనం నేర్పుతారు. ఇంతకీ అసలు చిక్కేమిటంటే ఇండియానుంచి వచ్చి ఎల్ కెజీ నుంచి ఇక్కడే చదువుకున్న పిల్లలు అలాగే జీవించాలనుకోవడం అవే భావాలు ఎవరినీ లెక్క చేయకపోవడం అవే అలవాట్లు "మాకిదే తెలుసు దీనికే అలవాటు పడ్డాం ఇప్పుడు కొత్తగా మీరేం చెప్పినా మాకలవాటు లేదుకదా !" అని ఎదురు తిరగడంతో ఇక్కడ స్థిర పడిన భారతీయులు కొందరికి ముఖ్యంగా అమ్మాయిలున్న వాళ్ళకి అరగట్లేదు కొరుకుడు పడక కొందరు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇండియా వెళ్ళి పోతున్నారు ఇప్పుడు చెప్పండి ఇలా తరచి చూస్తే దూరపు కొండలు నునుపో గరుకో ?

2 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

ఆసక్తికరంగా ఉన్నది మీ విశ్లేషణ.
కానీ, కొంచెం నిర్మొహమాటంగా చెబుతున్నాను, క్షమించండి - మీ విశ్లేషణకూడా సాధారణంగా పిల్లల్ని చూసిపోవడానికి అమెరికా వచ్చి ఆ ఏముంది ఇక్కడ అని పెదవి విరిచే పెద్దవాళ్ళ తరహాలో పైపై అంశాలనే పట్టించుకున్నది తప్ప, ఎక్కడా లోతుల్లోకి వెళ్ళలేదు. బాగా చదువుకున్నవారు, రచయిత్రి, జీవితాన్ని బాగా తెలిసిన వారు ఐన మీవంటి వారు అమెరికా జీవితాన్ని మీ అనుభవాలతో ఇంకొంచెం లోతుగా విశ్లేషిస్తే చదవాలని ఉంది.
ఇక్కడే స్థిరపడిన మాలాంటి వాళ్ళము నొచ్చుకుంటామేమోనని నియంత్రించుకోవలసిన అవసరం లేదు. ఒకే టపాలో అంతటినీ గుది గుచ్చాల్సిన అవసరమూ లేదు, వివరంగా విపులంగా రాయండి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చాలా బాగుంది మీ విశ్లేషణ. నాణానికి రెండు వైపులా ఉంటుంది మీరన్నట్టు ఒక కోణం నుంచి మాత్రమె రాసాను రెండో వైపు రాయాలనుకుంటూనే జాప్యం చేసాను.నొప్పించి ఉంటె మన్నించ గలరు.తప్పక త్వరలోనే మీ సూచనని గౌరవించ గలను .మా పిల్లలు ఇక్కడ సిటిజన్లు.అక్కడి వారి అభిప్రాయాలను ఉద్దేశించి మాత్రమె రాసాను.ఇంత చక్క గా ప్రొత్స హించి నందుకు చాలా సంతోషం గా ఉంది.త్వరలోనె

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase