జెర్సీ ఆవుల గురించి విన్నాం గానీ, ఎల్సీ కోర్ట్ గురించి ఎంత మందికి తెలుసు? ఏమో! అందరికి తెలుసేమో గానీ, నాకు మాత్రం ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే, రోజూ ఉదయం సాయంత్రం వాకింగుకి ఆ కోర్టు ముందునుంచే వెడతాం గనుక, అక్కడున్న ఆ బోర్డు ఈ రోజే చదివాను గనుక. ఇంతకీ జెర్సీ ఆవైనా, ఎల్సీ కోర్టైనా, శ్రీ శ్రీ చెప్పినట్టు అదే "అగ్గి పుల్ల కుక్క పిల్ల సబ్బు బిళ్ళ" లాగ అన్నమాట. వాకింగంటే, ఈ సమ్మరు పుణ్యమా అని జైలు వదలిన ఖైదీల్లా, ఆడా మగా, పిల్లా పెద్దా, ముసలీ ముతకా అందరూ హాయిగా గాలి ఫీల్చుకుంటారు. ఏసీలూ, హీటర్లు అన్నీ ఆపేసి, తలుపులు తీసుకుంటారు. పిల్లలు స్విమ్మింగుకి (పెద్దలు కూడా), టెన్నీస్, బాస్కెట్ బాల్, సైక్లింగ్, అలా వారి వారి ఇష్టాలకి పరుగులు తీస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వాకర్ గార్డెన్లో, భారతీయత ఉట్టిపడుతూ ఉంటుంది. రంగు రంగుల సీతాకోక చిలుకల్లా, అందమైన చీరలు, చక్క చక్కటి డ్రెస్సులు, ముచ్చట ముడులు, వాలు జడలు విరబోసిన జుట్లు, జుట్టుకి హైలైట్లు (రంగులు), ఇలా కొందరుంటే, టైటు పాంట్లు, టీ షర్ట్లు, చెడ్డీలు, మిడ్డీలు, స్లీవ్ లెస్సులు, తెల్ల వాళ్ళు, నల్లని వాళ్ళు, మధ్య రకం వాళ్ళు, పొట్టి పొడుగు లావు సన్నం, ఇలా రకరకాలుగా వాకింగు సోయగాలతో కన్నుల విందు చేస్తూ ఉంటారు. ఇక స్విమ్మింగ్ పూల్ లో ఐతే, అర మీటరు బట్టతో, అవసరమైన చోట్ల తప్పా, మరే ఆచ్చాదన లేక అందాల భామలు అలా అలా మత్స్య కన్యల్లా, నీళ్ళల్లో మునుగుతూ తేలుతూ, ఒడ్డున కూర్చున్నవారికి ప్చ్! ఏ కవుల కలాల్లో ఎలా రంగరింపబడతారో ఉహాతీతమే. ఇక, దేశం చూడాలనో, అమ్మాయి డెలివరీ కనో, పిలవగా వచ్చిన అమ్మలు, కొడుకులు మాత్రమే (కోడళ్ళు పిలవక పోయినా)పిలవగా వచ్చిన అత్తలు, "అమ్మ వెళ్ళిపోతే ఈ చాకిరీ అంతా ఎలా చేసుకోవాలా?" అని బాధ పడే కూతుళ్ళూ, అమెరికా వచ్చినా అత్త పోరు తప్పలేదని తిట్టుకునే కోడళ్ళూ, వదిలేసిన ఉద్యోగాలూ, నడుస్తున్న రాజకీయాలు మాట్లాడుకునే తండ్రులు, ఇలా ఎవరికి వారు జట్ట్లు జట్ట్లు గా వాగ్వివాదాలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నట్లు గుబురు గుబురుగా చక్కగా చిక్కగా కొత్త చివురులు తొడుగుతున్న చిట్టడవుల్లా పచ్చదనానికి ప్రతీకగా అంతెత్తు వృక్షరాజాలు. ఆ మధ్య నుంచి నిమిషానికో సారి రణగొణ ధ్వని చేసుకుంటు దూసుకు పోయే రైళ్ళ శబ్ధ తరంగాలు, ఏ హారను లేకుండా, రోడ్డు మీద చిరు సవ్వడితో సాగి పోయే కార్లు, రోడ్డుకిరు వైపులా సన్నని కాలిబాటలు "లాన్ డాక్టర్లు" అందంగా కట్ చేసిన పచ్చిక దారులు పైన హాయిగా గుంపులు గుంపులుగ ఎగిరే స్వేచ్చా విహంగాలు సునిసితంగా తాకిపోయే సన్నని గాలి తెమ్మెరలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో అందంగా హాయిగా ఆహ్లాదంగా ఉండే ప్రకృతి సౌందర్యం అనుభవేద్యమే గానీ వర్ణనాతీతం. ముఖ్యంగా సమ్మరులో ప్రతి వాళ్ళూ ఇంటి ముందరా వెనుక (బాక్ యార్డ్ ) పూల మొక్కలు, కాయ గూరలూ, వారి వారి ఇస్టాలని బట్టి పెంచుకుంటారు. అంతే కాదు డెక్ (పాటియో) మీద సమ్మరుని వీలైనంత ఎంజాయి చేస్తూ ఉంటారు.
ఇంతకీ మనం వాకింగులో పడి ఎటో వెళ్ళి పోతున్నామా? లేదు, అదిగో ఎల్సీ కోర్ట్ కి రానే వచ్చాం. ఇంతకీ ఈ "ఎల్సీ" అనేది ఒక ఆవు. అసలు ఈ వాకర్ గోర్డెన్ ఒకప్పుడు డైరీ ఫారంగా ఉండేదట. 150 పైగా ఆవులు ఉండేవట. వాటిలో ఒక ఆవు ఎక్కువగా పాలు ఇచ్చేదట. అందువలన ఆ పాల ఏజెన్సీ మన ఆవుకి "ఎల్సీ" అని పేరు బెట్టి, వ్యాపారం మొదలుపెట్టగా విపరీతమైన లాభాలు రావడంతో ఆవు బొమ్మనే గుర్తుగా వ్యాపార ప్రకటనలకి వాడుకున్నారట. ఎక్కువగా పాలు ఇస్తూ లాభాలు పెంచి అందరిని ఆకట్టుకుని చిరస్థాయిగా ఫేరు మిగుల్చుకుంది. ఈ పాలమీద వచ్చిన డబ్బు పది మిలియన్ డాలర్లు, రెండవ ప్రపంచ యుద్ధంలో క్షతగాత్రులకి విరాళంగా ఇచ్చారట. ఇంతకీ అసలు ఒక పత్రికలో కార్టూన్ సీరియల్ గా వస్తున్న ఒక జంతువు, అదే ఆవు బొమ్మ గుర్తు, ప్రపంచ వ్యాప్తంగా ప్రకటన గుర్తుగా పేరు పొందింది. ఈ బొమ్మ పేరుతో హోటళ్ళూ, మోటళ్ళూ, స్వీట్ షాపులు, వెబ్ సైట్లు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. అది ఒక జంతువు, ఆవు ఐనా 1932 నుంచి 1940 వరకు అందరినీ ఆకట్టుకుని చరిత్రలో నిలిచింది. ఇంతకీ ఒకనాడు, న్యూయార్క్ సిటీ నుంచి వాకర్ గోర్డన్ కు తిరిగి వస్తూండగా, ఒక పెద్ద ట్రక్కు కొట్టేయడంతో, బాగా దెబ్బలు తగిలి, వెంటనే మరణించిందట. అప్పుడు దాని మృతదేహాన్ని, ఇదే వాకరు గోర్డెన్లో పాతిపెట్టి, ఒక చిన్న మండపంలా చెక్కతో కట్టి, అక్కడే రాతిపలక మీద దాని చరిత్ర కొంత రాసి ఉంచారు. నిజానికి ఒకప్పుడు న్యూజెర్సీ ప్లైన్స్ బరో బంగారు భూమిగా అనుకునేవారట. కానీ అది నిజంగానే బంగారం పండించిందన్న సంగతి ఈ ఎల్సీ ద్వారా మరింత దృఢపడింది. ఎందుకంటే అది మంచి ప్రకటన గుర్తు. దాని మరణానంతర ఆ పాల వ్యాపారం అక్కణ్ణుంచి తరలి పోయింది. పిమ్మట ప్లైన్స్ బరో వాకరు గోర్డెన్ లో, ఎన్నో ఇళ్ళు వెలిసి, కాలనీలా తయారైంది. అదే ఈ ఎల్సీ కోర్ట్ ! ఎల్సీని అన్ని సందర్భాలలో గుర్తు చేసుకుంటారు. దాని జ్ఞాపకార్ధం, 40 అడుగుల విగ్రహాన్ని తయారు చేసి స్పోర్ట్స్ టీమ్ గుర్తుగా ఉంచాలని ఒక ప్రయత్నం. అది చదివాక, మనసు కలత పడింది. ఏమైతేనేం? ఇక్కడ జంతువుల్ని బాగా పెంచుతారనిపిస్తుంది. ఎందుకంటే, వాటి పేర్ల మీద ఆస్తులు రాయడం, సమాధులు కట్టడం, తరచూ తెలుస్తూ ఉంటుంది. ఇక పిల్లలని 18 ఏళ్ళు రాగానే వదిలేస్తారు. భార్యా భర్తలు ఎంత కాలం కలసి ఉంటారో, ఎప్పుడు విడిపోతారో తెలియదు. అందుకేగా, పిల్లలకి గార్డియన్ గా తల్లి పేరే రాస్తారు. అందుకే ఫాదర్స్ డే, మదర్స్ డే, లవర్స్ డే అంటూ ఆ డే నాడు మాత్రం కలుస్తారు. మరి ఆ ప్రేమలేమిటో అంతు బట్టనివి. కక్షలు, కార్పణ్యాల మధ్య నిలువెల్లా విష పూరితమైన మనిషి కంటే తాను గడ్డి తిని మనకి పాలిచ్చే ఆవు, ఆ మూగ జీవే నయమనిపిస్తుంది. పసివారిని విడిచి జాకెట్ట్లు తడుపుకుంటూ ఆఫీసులకు వెళ్ళే భార్యలను చూసి గుండెలో సన్నని బాధ కదిలినా, "ధన మూలం ఇదం జగత్తు కదా?" అని సరి పెట్టుకోవాలి. జీవితం భార్యతో ముడివడినది గనుక, సీసాతో పాలు ఎవరైనా పట్టవచ్చును గనుక, సమానత్వం పేరుతో బేసిన్లు తోమాలి, ఇంటి పనులు చేయాలి, పిల్లల్ని చూడాలి. హతవిధీ? హా పురుష పుంగవా? అందుకే రాను రాను బరువనిపించే అమ్మ పోయినా, మళ్ళీ మళ్ళీ, పోషక విలువలున్న ఆవు పాలు మాత్రం అనునిత్యం పసివారికి చాలా అవసరం. ఎందుకంటే, మరి ఈ రోజుల్లో ఆవు పాలు ఆయా పాలు బాటిల్ పాలే కదా? అందుకే అమ్మలాంటి ఆవు ఆరోగ్యమైన పాలు. తమ పిల్లలకి అమ్మకి బదులు ఆవు, అదే "ఎల్సీ ది కౌ".
2 కామెంట్‌లు:
బాగుందండీ.
ఎల్సీ సమాధిని గురించి ఈ వ్యాసం కనబడింది.
http://www.roadsideamerica.com/pet/elsie.html
dhanya vaadamulu
కామెంట్‌ను పోస్ట్ చేయండి