మరుత్తులు
తన పుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల మరణానంతరం దుఃఖితురాలైన దితి కశ్యపుని చెంత జేరి భర్తకు శ్రద్ధగా సపర్యలు చేయడం వలన కశ్యపుడు ఆమెనుద్దేశించి "ప్రేయసీ! నీ శుశ్రూషలకు మిక్కిలి సంతసించితిని. ఏమి వరము కావలయునో కోరుకొనుము, అవశ్యము నెరవేర్చెదను" అని వాగ్దాన మొసంగెను.
అందులకు సంతసించిన దితి "ఇంద్రుని జయించగల పుత్రుని ప్రసాదించమని" కోరినది. అందుకు కశ్యపుడు చింతించి "ఇచ్చిన మాట దాట రాదు కావున, శుభాంగీ ! నీవు ఒక సంవత్సరము నియమ నిష్టలతో వ్రతమాచరించిన యెడల నీ కోరిక తీరగలదు" అని భార్యకు వ్రతమునుపదేశించెను. అందులకు సమ్మతించిన దితి గర్భవతియైనది. ఇంద్రునికీ విషయము తెలిసి భయపడి, మారువేషమున ఆమె చెంత జేరి,శుశ్రూషలొనరించు సమయము కొరకు పొంచి ఉండగా
ఒక దినము సాయం సమయమున ఎంగిలి తాకి కాళ్ళు చేతులు శుభ్రము చేసుకొనకుండా దితి మైమరచి నిద్రించినది. అప్పుడు సమయమునకయి పొంచి ఉన్న ఇంద్రుడు, ఆమెకు నియమ భంగమైనందుకు మిక్కిలి సంతోషముతో తన యోగ మాయవలన ఆమె గర్భమునందు ప్రవేశించి గర్భ కోశమునందుగల పిండమును ఏడు ముక్కలుగా చేసి మరల ఆ ఏడుముక్కలను ఒక్కొక్క దానిని ఏడు చుప్పున మొత్తము 49 ముక్కలుగావించెను. అప్పుడు ఆ శిశువులు "అన్నా మేము నీకు తమ్ములము మమ్ము కాపాడుము" అని మొఱపెట్టుకొనగా ఇంద్రుడు ఆ 49 మందికి దైవత్వము నొసగి సోమపానము జేయు అధికారము ఇచ్చెనట. వారే "మరుత్తులు" అనగా ఇంద్రుని అనుచరులు (సోదరులు)
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి