Pages

31, డిసెంబర్ 2011, శనివారం

" చమత్కార పద్యాలలో " " పాదుకలు "

భరతుడు శిరమున దాలిచి
పరమ పవిత్ర మ్ము లైన పాదుక లనుచున్ !
కరములు జోడించి యతడు
ధరణిని పాలించ దొడగె ధార్మిక నిరతిన్ !

30, డిసెంబర్ 2011, శుక్రవారం

" ఏడడుగుల బంధ మౌర ! యేటికి బంపెన్ !

మూడడుగు లొసంగి తినని
వేడుకగా దివికి వెడలె వేలుపు బలియౌ !
ఏడేడు జన్మల నుచును
ఏడడుగుల బంధ మౌర ! యేటికి బంపెన్ !
-----------------------------------------
ఏడాది కొకప పరియని
వేడుకగా వెడలె నంత పెనిమిటి తోడన్ !
ఏడేడు నగము లెక్కిరి
ఏడడుగుల బంధ మౌర యేటికి బంపెన్ !

29, డిసెంబర్ 2011, గురువారం

" చల్లగ గాపాడు గీత సైబిరి యనులన్ "

" శ్రీ మనతెలుగు చంద్ర శేఖర్ గారి సమస్య "
-----------------------------------------
కల్లా కపటము తోడను
నల్లని కన్నయ్య ఘనత నచ్చని వారై !
చిల్లర చేష్టలు చేసిరి
చల్లగ గాపాడు గీత ! సైబిరి యనులన్ !

" విజయశ్రీ కలిత గీత ! వేవేల నుతుల్ "

" శ్రీ పండిత నేమాని వారి సమస్య "
------------------------------------
భజనలు చేయగ కృష్ణుని
విజయమ్ములు పొంద వచ్చు విభవము తోడన్ !
గజమునకు మోక్ష మిచ్చిన
విజయ శ్రీ కలిత గీత ! వేవేల నుతుల్ !

28, డిసెంబర్ 2011, బుధవారం

" " నిషిద్ధాక్షరి " [ క ,ఖ , గ , ఘ , జ . ] కాకి కోకిలల పై సామ్యం "

చుట్టములు వొత్తురో యని
పెట్టుము దధ్యన్న మనుచు పెరడున నిలచున్ !
అట్టే నలుపై యుండిన
వొట్టే నీ పాట వినని చొ నొప్పే ఎడదన్ !

25, డిసెంబర్ 2011, ఆదివారం

" దండనము కాదు కాదది పండు వయ్యె "

గంగ యంతటి పావని భంగ పడక
భువికి దిగి వచ్చి జగతికి భాగ్య మిచ్చె
లోక రక్షణ చేయుట యోగ్య తయని
దండనము కాదు కాదది పండు వయ్యె .

" త్రాతనే పాముగా నెంచి తరుమ దగునె ? "

వెండి కొండను దిరిగెడి వేల్పు తోడ
భవుని గళమున నిలచిన భాగ్య మనుచు
తక్ష శిలనేలు రాజును దయను వీడి
త్రాతనే పాముగా నెంచి తరుమ దగునె ? "

22, డిసెంబర్ 2011, గురువారం

" విష గుళిక యయ్యె గీతా వివేక రసము "

వేద ములనుండి పొం దియె విజ్ఞు లనుచు
ఆదు నికమంచు శాస్త్రము నపహరించి
పచ్చ కామెర్లు కలిగిన పిచ్చి దొరకు
విష గుళిక యయ్యె గీతా వివేక రసము.

" గంగ మునిగి పోయె గంగ లోన "

విష్ణు పదము వీడి వెల్లువై ప్రవహించి
మృడుని శిరము పైన సుడులు తిరిగి
భువిని మలిన మందు దివిజ పావన
గంగ మునిగి పోయె గంగ లోన
-------------------------------------
జలక మాడ నెంచి జలజాక్షి నదికే గె
లోతు తెలుసు కొనక ప్రీతి గాను
పెద్ద చేప యొకటి పెను భూతమై పట్టి లా
గంగ మునిగి పోయె గంగ లోన

21, డిసెంబర్ 2011, బుధవారం

" సంపన్నుల దైవ మగును శంకరు డెన్నన్ "

చెంపను కెంపులు విరియగ
సొంపగు చండికను గొలువ శంకరు పత్నిన్ !
పెంపెనగు ముదము తోడను
సంపన్నుల దైవ మగును శంకరు డెన్నన్ !

శివ .......శివా....= పార్వతీ + శివుడు = ఇద్దరు ఒక్కటే .కావున ముందు దేవిని కొలిస్తే దైవం ప్రసన్ను డౌ తాడని .

18, డిసెంబర్ 2011, ఆదివారం

" పలికి చేసి చూచి కొలిచి యలరు "

శ్రీ పండిత నేమాని వారి సమస్య
-------------------------- -----
చంద మామ వంటి అందాల భామతో
చెలిమి చేయ నెంచి లలిత గతుల
ఎదను గోరు ప్రేమ ముదముగా వివరించి
పలికి చేసి చూచి కొలిచి యలరు
----------------------------------
మట్టి బొమ్మ జేసి మనసార పూజించ
గట్టి వరము లిచ్చు గజము ఖుండు
మంచి మనసు తోడ మాలక్ష్మి సేవించ
పలికి చేసి చూచి కొలిచి యలరు

16, డిసెంబర్ 2011, శుక్రవారం

" శ్రీ కృష్ణున కిచ్చె సిరి కుచేలుడు నెమ్మిన్ ! "

నే కౌతుకమున వచ్చితి
నా కౌమారపు సఖునకు నటుకుల నీయన్ !
చేకొను పిడికెడు ప్రేమను
శ్రీ కృష్ణున కిచ్చె సిరి కుచేలుడు నెమ్మిన్ !

14, డిసెంబర్ 2011, బుధవారం

" సుర హితమ్ము గోరు శుక్రు డెపుడు "

బలిని హితము గోరి వలదని వారించె
వడుగు కాదు వాడు వామ నుండు
పరమ పూజ్యు డైన గురువు గానయ
సుర హితమ్ము గోరు శుక్రు డెపుడు

12, డిసెంబర్ 2011, సోమవారం

" సమరమునే కోరినాడు శాంతిని పొందన్ ! "

" గోలి హనుమత్సాస్త్రి గారి సమస్య "
కుముదము చేకొని యాతడు
రమణీమణి చెంత జేరి రాగము తోడన్ !
బ్రమియింప దలచి భార్యను
సమరమునే కోరినాడు శాంతిని పొందన్ !

రాగము = అనురాగము

10, డిసెంబర్ 2011, శనివారం

" తామస గుణ రూపు డంద్రు దత్తాత్రేయున్ !

నామము దలచిన వెంటనె
క్షేమము చేకూర్చు జనుల చింతలు బాపున్ !
పామరులు తెలిసి తెలియక
తామస గుణ పూర్ణు డం ద్రు దత్తా త్రేయున్ !

9, డిసెంబర్ 2011, శుక్రవారం

" దాత విలపించె వేరొక దారి లేక "

దాన మీయగ నాతని ధనము కరిగి
రిక్త హస్తము నెవరికి భుక్తి నియక
మరలి పొమ్మని చెప్పగ మాట రాక
దాత విలపించె వేరొక దారి లేక

ఇదికూడా సుజన రంజని వారి సమస్య

8, డిసెంబర్ 2011, గురువారం

" దొరలే దొంగలుగ మారి దోచిరి ధనముల్ ! "

కరువులు పెరిగిన బ్రతుకుల
బరువును భరియించ లేక బాధలు పడుతున్ !
దొరతన మేటికి మనకని
దొరలే దొంగలుగ మారి దోచిరి ధనముల్ !

ఇది సుజనరంజనిలొ " గండి కోట విశ్వనాధం గారి " సమస్య

5, డిసెంబర్ 2011, సోమవారం

" కట్ట మంచి రామలింగా రెడ్డి "

డాక్టర్ .సి.ఆర్ . రెడ్డిగా ప్రసిద్ధి చెందిన " కట్టమంచి రామ లింగా రెడ్డి గారూ " ప్రతిభా వంతుడైన , మంచి సాహితీ వేత్త. అంతే కాదు, పెద్ద పండితుడు , విద్యా వేత్త , హాస్య రచయిత , వక్త , రచయిత , హేతు వాది , ఆదర్శ వేత్త , రాజ నీతిజ్ఞుడు , ఇలా బహు ముఖ ప్రజ్ఞాశాలి . అయితే , ఇంతటి ప్రతిభా వంతుడైన రెడ్డి గారు ," ఆంధ్ర భాషా రంజని " సంఘంలో , చురు కైన పాత్రను కుడా పోషించారు. అంతే కాదు ," గైక్వాడ్ స్పూర్తితో " అమెరికాలో విద్యా భ్యాసం చేసారు.
ఈయన చిత్తూరు జిల్లా కట్టమంచి గ్రామంలో ౧౮౮౦ {1880 ] డిసంబరు ౧౦ [ 10 ] న జన్మిం చారు. నారాయణమ్మ ,సుబ్రమణ్య రెడ్డి , దంపతులకు యితడు మూడవ సంతానం. అయితే , సుబ్రహ్మణ్య రెడ్డి సోదరు డైన , పెద రామస్వామి రెడ్డి గారు , మన రామలింగా రెడ్డి గారిని , దత్త పుత్రుడు గా స్వీకరించారు.
ఇక , వీరి విద్యా భ్యాసం , తన ఐదవ ఏటనే వీధి బడి చదవుతో ప్రారంభ మైంది. ఈయన తన చిన్న వయసులోనే ,భారతాన్ని , అమర బాల రామాయణాన్ని ,చదివే వారట . వీరు ౧౮౯౦ [ 1890 ] లొ ప్రస్తుత పేరుతొ ఉన్న " సి .ఆర్ . రెడ్డి . " పేరుతొ ఉన్న చిత్తూరు బోర్డ్ " హై స్కూల్ లొ , మొదటి ఫారంలో జేరి , ప్రతి పరీకః లోను ఉన్నత శ్రేణిలో గెలుపు సాదిం చారు. పిమ్మట ,ఉన్నతా భ్యాసం కోసం , మదరాసు క్రైస్తవ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తి చేసారు. ఇక తన ౧౯ [19 ] వ ఏటనే , " ముసలమ్మ మరణం " అనే కావ్యాన్ని రచించి , బహుమతి పొందడం జరిగింది. ఇది ౧౮౯౯ [ 1899 ] లొ " నవ్య కావ్య " రచన పోటీలో గెలు పొందినది . అంతే కాదు
వీరు , ౧౯౦౨ [ 1902 ] లొ డిగ్రీ పరీక్షలో " తత్వ శాస్త్రం లొ " అత్యధిక మార్కులతో , ఉత్తమ శ్రేణిలో గెలుపొంది , బంగారు పతాకాన్ని పొందారు. అలాగే , మంచి వక్తగా , ఆంగ్ల తెలుగు భాషలలో , మరెన్నో బహుమతులు గెలుచు కోవడం జరిగింది. డిగ్రీలో మంచి మార్కులు రావడం వల్ల , ప్రభుత్వం వారు , స్కాలర్ షిప్ తొ ఇంగ్లండు లోని " కేంబ్రిడ్జి " విశ్వ విద్యాలయానికి పంపించారు. అక్కడ పలు బహుమతులను అందు కొన్నారు. వారి ప్రతిభా పాటవమునకు గుర్తింపుగా , ౧౯౦౩ [ 1903 ] లొ " రైట్ " బహుమతి లభించింది . పిమ్మట " విద్వాంసుడు " పురస్కారాన్ని అందుకున్నారు. తదుపరి విశ్వ విద్యాలయంలో , " యునియన్ లిబరల్ క్లబ్ " కార్య దర్శి గా ఎన్నికై అక్కడ అనేక ఉపన్యాసాలలో , ఆంగ్లేయుల మన్ననలు , ప్రసంసలు , పొందారు . ఒక భారతీయుడిగా ఇటువంటి గౌరవం దక్కడం , అదే ప్రధమం . పిమ్మట వారు ఎం.ఏ. పరీక్షలో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందారు.
వారికి విద్యా శాఖలో ఉద్యోగం ఇవ్వదలచి , ఆ సంస్థాన దీసుడైన " సయాజీ రావ్ గైక్వాడ్ " రెడ్డి గారి ప్రతిభను గుర్తించి ,అందుకు గాను మరిన్ని విశ్వ విద్యాలయాలు సదర్సించ డానికి అమెరికాకు పంపించాడు. పర్యటన పూర్తి జేసి , ౧౯౦౮ [ 1908 ] లొ స్వదేశానికి వచ్చి తన ౨౮ [ 28 ] వ ఏట బరోడా కళాశాలలో ఆచార్యునిగా , తోలి ఉపాధ్యాయుని గా ప్రారంభించి , విద్యా వ్యవస్థను , మరింత మరింత అధ్యయనం చేయడానికి అమెరికా , ఫిలిప్పైన్స్ , జపాన్ దేశాలు పర్య టించారు . వీరి సాహితీ సేవ అనన్యం.
వీరు రచించిన " ముసలమ్మ మరణం " ౧౯౦౦ లొ తోలి ముద్రణకు నోచు కుంది . అంతే కాదు " భారత అర్ధ శాస్త్రం , కవిత్వ తత్వ విచారం , ఆంధ్ర సర్వ కళాశాల విద్యా ప్రవృత్తి , లఘు పీఠికా సముచ్చయం , వ్యాస మంజరి , పంచమి , వేమన , మున్నగు నవి వీరి తెలుగు రచనలు. సాహిత్యంలో సరి కొత్త భావాలకు , మనో వికాసాత్మక మైన విమర్శలు , సంభాషణలతో , దెబ్బకు దెబ్బ తీయగల నేర్పు , వాదనా చాతుర్యం , హాస్య ప్రియత్వం , ఛలోక్తులు , సంభాషణా నైపుణ్యంతో , ఆకట్టు కొ గలిగిన దిట్ట. ఆంగ్ల రచనల్లో చేయి తిరిగిన వ్యక్తి. ఆంగ్లం లొ మచ్చుకి " డ్రామా ఇన్ ది ఈస్ట్ అండ్ వెస్ట్ " , స్పీచస్ ఆన్ యునివర్సిటీ రిఫార్మ్" , డెమోక్రసీ ఇన్ కాన్ టెంపరరీ ఇండియా " మున్నగు నవి. కొన్ని మచ్చు తునకలు మాత్రమే.
అంతే గాక " ఆంధ్ర భాషాభి రంజని " వారి పోటీలో బహుమతి గెలుచు కుంది.
ఇక రెడ్డిగారి ఛలోక్తులు , హాస్య చతురత , సమయ స్పూర్తి , శ్లాఘ నీయం.
" ఒకసారి ఆయన తన [ అన్నగారి ] అల్లుని ఇంటికి వెళ్ళి నప్పుడు , ఇంటి ముందు కారు దిగి అక్కడ " కుక్కలున్నాయి జాగ్రత్త " అన్న బోర్డ్ చూసి " ఇక్కడ ఇంతకు ముందు మనుషులుం డేవారు కదా ? " అని చమత్కరిం చారట.
" ఇంకొకసారి ఆయన పరసం గిస్తుండగా కరెంటు పోయిందట . అప్పుడు " చీకట్లో మాట్లాడటం నాకు అలవాటు లేదు . బ్రహ్మ ఛారిని కదా ! " అని ఛలోక్తి విసిరారట.
" మనం పేద వాళ్ళం కావచ్చు , కానీ బిచ్చ గాళ్ళం కానక్కర లేదు. "
" ఈ నాటి యువత , " సలహాలు తీసు కోవడం కంటె ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నారు " అంటూ ఇలా ఎన్నో , ఎన్నెన్నో .
ఇక వీరి పదవులు . ౧౯౨౬ [ 1926 ] లొ " డాక్టర్ . సి . ఆర్ . రెడ్డి . ఆంధ్ర విశ్వవిద్యాలయానికి , తొలి ఉపాధ్యక్షుని గా నియమితు లయ్యారు. పిమ్మట , ప్రభుత్వ దమన నీతికి నిరసనగా , ౧౯౩౦ లొ రాజీ నామా చేసారు. తదుపరి మళ్ళీ వారికి ౧౯౩౬ లొ ఆ పదవిని అప్పగించింది .
వీరు తెలుగుని " ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ " అని నిర్వచించారు.
వీరు ఆజన్మాంతం బ్రహ్మ చారిగానే మిగిలి పోయారు. ౧౯౫౧ ఫిబ్రవరి ౨౪. న తుది శ్వాస విడిచారు. వీరి విగ్రహాలు పలు చోట్ల ఉన్నాయి. ప్రస్తుతం ఏలూరులో సి. ఆర్. రెడ్డి .పేరున ఉన్న కళాశాల వీరి పేరున ఉన్నదే

" హనుమంతుని భార్య లిద్దరని చెప్ప దగున్ !

హనుమకు నిద్దరు భార్యలు
వినుటకు చోద్యముగ నుండు వివరిం పదగున్ !
కనుమా ? నిజమా ? హనుమా ?
హనుమంతుని భార్య లిద్దరని చెప్ప దగున్ !

4, డిసెంబర్ 2011, ఆదివారం

" ఒక్కడే కాక వేరొకం డుండు నొక్కొ "

కన్నె సరసన కూర్చుని వెన్నె లందు
గాలి పెదవుల బాసలు కవిత లల్ల
జగతి మరపింప జెసెడి చంద్రు డతడు
ఒక్కఁ డే కాక వేఱొకం డుండు నొక్కొ !
----------------------------------------
సకల జీవుల బ్రతికించు సవితు డొకడె
వెలుగు విరజిమ్మి చీకటి గెలుచు కొనెడి
నమ్మి కొలిచిన దైవమ్ము వమ్ము కాదు
ఒక్కఁ డే కాక వేఱొకం డుండు నొక్కొ

3, డిసెంబర్ 2011, శనివారం

" భాను కాంతితో తారలు ప్రభల జెలగె "

మింట నుండెడి తారలు మెఱయు నిశిని
పుడమి పై నున్న ప్రాణుల పుణ్య మేమొ
పగటి పూటను నడయాడు పడతు లనగ
భాను కాంతితో తారలు ప్రభల జెలగె !

2, డిసెంబర్ 2011, శుక్రవారం

" జంట కవులు "

మనం చెప్పుకో దగిన వారిలో , ప్రసిద్ధులైన కవులు ," తిరుపతి వెంకట కవులు. " వీరినే " జంట కవులు అని కుడా అంటారన్న సంగతి జగద్విదితం .వారిలో ఒకరు " దివాకర్ల తిరుపతి శాస్త్రి " ,మరొకరు " చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి. " వీరిద్దరూ " తిరుపతి వేంకట కవులనీ , జంట కవులనీ " ప్రసిద్ధి కేక్కినారు.
వీరు తెలుగు సాహిత్యంలో దిట్ట. తెలుగు కవిత్వం , అవధానములు , నాటకములు , వీరి ప్రత్యేకత . వీరు ఇంచు మించు వందకు పైగా , తెలుగు గ్రంధాలు , నాటకములు , అనువాదములు , వ్రాసారు. అవధానములలో వీరి పాండిత్యం , వీరి ప్రతిభ , చతురత , నేటికీ , సాహితీ సమాజంలో కొనియాడ దగినది. ఇప్పడికీ వీరి నాటకముల లోని పద్యాలు { అనగా " పాండవోద్యోగ విజయము " మున్నగు వాటిలోని } తెలుగు నాట పండిత పామరుల నోట విన బడుతూనే ఉంటాయి." బావా ఎప్పుడు వచ్చితీవు ," జండాపై కపిరాజు , చెల్లియో చెల్లకో " మున్నగు నవి.
తిరుపతి శాస్త్రి గారూ , ౧౮౭౨[ 1872 ] మార్చి ౨౬ [26 ] న పశ్చిమ గోదావరి జిల్లా భీమ వరం వద్ద , యండగండి గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి వెంకటావధాని గారూ గొప్ప వేద పండితుడే గాక సూర్యోపాసకుడు కూడా. ఇక తిరుపతి శాస్త్రి గారి విద్యాభ్యాసం , " గరి మెళ్ళ లింగయ్య , బూర్ల సుబ్బారాయుడు , పమ్మి పేరి శాస్త్రి , చర్ల బ్రహ్మయ్య శాస్త్రి , వద్ద జరిగింది.
అయితే ఈ చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి వద్ద చదువుకునే రోజుల్లోనే , చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తొ పరిచయం కుదిరింది. ఆ రోజుల్లోనే తిరుపతి శాస్త్రి గారి వివాహం కుడా ౧౮౯౮ [ 1898 ] లొ జరిగింది .కాకపొతే వీరు మధుమేహ వ్యాధి కారణంగా చిన్న వయసులోనే ౧౯౨౦[ 1920 ] లోనే మరణించారు.
ఇక చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు ౧౮౭౦[ 1870 ] లొ ఆగస్టు ౮[ 8 ] వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కడియం జన్మించారు. ఈయన ముత్తాతగారి తమ్మడు , వెంకటేశ్వర విలాసం , యామినీ పూర్ణ తిలక విలాసం వంటి మహాద్ గ్రంధాలను రచించిన గొప్ప పండితుడు . ఆయన రచించిన తాళపత్ర గ్రంధాలు వేంకట శాస్త్రికి అందు బాటులో ఉం డేవట . ఇకపోతే ఈయన యానాం లొ తెలుగు ,ఆంగ్ల , సంస్కృత , భాషలు అధ్యయనం చేసారు. ఇక వీరి గురువులు ,కానుకుర్తి భుజంగ రావు , అల్లంరాజు సుబ్రహ్మణ్యం , కవిరాజు , మున్నగు వారు. యితడు ౧౮ ఏండ్ల వయస్సులోనే " యానాం వెంకటేశ్వర స్వామి గురించి " శతకం వ్రాశాడట . అందులోని వ్యాకరణ దోషాలను గురించి , అచ్చటి పండితులు విమర్శిం చగా , అవమానంగా భావించి , మన వేంకట శాస్త్రి , సంస్కృత వ్యాకరణం నేర్చు కోవడానికి వారణాసికి వెళ్లాలని నిశ్చయిం చు కొన్నాడట . కానీ ఆర్ధిక ఇబ్బందుల వలన వెళ్ళలేక పోయాడు. అంతేగాక అతడికి పుట్టుక నుండీ ఒక కన్ను సమస్య గా ఉండేదట.
పిమ్మట శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి వద్ద విద్యా భ్యాసం చేస్తున్నప్పుడు , తిరుపతి శాస్త్రితో పరిచయం కావడం , ఇద్దరు వెంకటశాస్త్రి అధ్యాపకుని వద్ద శిష్యులు గా ఉండేవారు. పిమ్మట , ప్రసిద్ధులైన విశ్వనాధ, వేటూరి ,పిగళి మున్నగు వారివద్ద జంట కవులుగా ప్రసిద్ధి పొందారు.
అసలు మొదటి నుండీ తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేదట. మరి చెళ్ళ పిళ్ళ వారు ఉపన్యాసా లివ్వడం , మెరుపులా పద్యాలల్లడంలో దిట్ట. అయితే ఒకసారి వినాయక చవితి ఉత్సవాల్లో చందాలు వసూలు చేయడం కొరకని , ఒకరిని మించి మరొకరు , తమ ప్రతిభను ప్రదర్సిం చారట. దాంతో వారి స్నేహం మరింత బలపడింది. తుదకు వెంకటశాస్త్రి వారణాసి వెళ్ళి తిరిగి వచ్చాక , ఇద్దరు జంటగా కాకినాడలో ., శతావధానం ప్రదర్సిం చారు. తరువాత జీవితాంతం , వారిరువురు ఒకరి కొకరు తోడుగా జంట కవులుగానే మిగిలి పోయారు. తిరుపతి శాస్త్రి మరణా నంతరం కుడా వెంకటశాస్త్రి తన రచనలను జంట రచనలు గానే ప్రచురిం చాడు.
ఇద్దరు కలసి అసంఖ్యాక మైన అవధానములు చేసి , అనేక సన్మానములు , పలు ప్రసంసలు అందు కొన్నారు. అడయార్ వెళ్ళినపుడు ,అనిబిసెంట్ ప్రసంసలు పాడారు. అంతేగాక " వేంకట గిరి , గద్వాల , ఆత్మకూరు , విజయ నగరం , పిఠాపురం . మున్నగు సంస్థానాలలో తమ తమ ప్రతిభను ప్రదర్శించి సత్కరింప బడటమే గాక , ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి " కళా ప్రపూర్ణ " బిరుదును పొందారు. పోలవరం జమీందారు వారి ప్రతిభను గుర్తిచి ," ఎడ్విన్ ఆర్నాల్డ్ " రచించిన " లైట్ ఆఫ్ ఆసియా " అనే గ్రంధాన్ని తెలుగులోకి అనువదించ మని కోరగా , ౧౯౦౧ లొ కాకినాడకు నివాసం మార్చి , ౧౮౮౯లొ పిఠాపురం రాజు ప్రారంభించిన సాహితీ పత్రికను నిర్వ హించి ," బాల రామాయణం ,ముద్రా రాక్షసం , మృచ్చ కటికం , వంటి గ్రంధాలను తెలుగులోనికి అనువదించారు. ఇక వీరి రచనలు , సంస్కృతంలో ౧౦ ది స్వతంత్ర రచనలు , ౧౫. అనువాదములు, ౨౫. ఠాగూర్ కదలు [ ఆంగ్లము నుండి తెలుగు లోనికి ] ఇంకా స్వతంత్ర కవితా రచనలు , నాటకములు , తెలుగు వచన రచనలు.
ఇక పొతే వీరి రచన నుండి మచ్చుకి కొన్ని
" అమ్మా సరస్వతీ ! నీ దయ వలన మేము ఎన్నో సన్మానాలు అందు కొన్నాము. " అంటూ చెప్పిన పద్యము.

ఏనుగు నెక్కినాము , ధరణీం ద్రులు మ్రొక్కగ నిక్కినాము స
న్మానము లందినాము బహుమానములన్ గ్రహియించి నార మె
వ్వానిని లెక్క పెట్టక నవారణ దిగ్విజయం బొనర్చి ప్ర
జ్ఞాన విధులంచు జేరు గొనినాము నీవలనన్ సరస్వతీ !

ఇక కవులకు మీసా లెందుకు .? అని ఎవరొ ఆ క్షేపిం చగా , తెలుగు లోను సంస్కృతం లోను మమల్ని మించిన వారెవరైనా ఉంటే , మీసాలు తీసి మొక్కుతామని సవాలు చేస్తూ చెప్పిన పద్యం చూడండి

దోస మటం చెరింగియు దుందుడు కొప్పగ పెంచి నారమీ
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రుల మంచు దెల్పగా
రోసము కల్గినన్ కవి వరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
మీసము దీసి మీ పద సమీపములం దలుంఛి మ్రొక్కమే ! అంటూ చమత్క రించారు .
ఇకపోతే మనందరి నోటా నిరంతరము పలికెడి పద్యాలు " పాండవోద్యోగ విజయం లోనివి.

బావా ఎప్పుడు వచ్చితీవు ? సుఖులే బ్రాతల్ సుతుల్ చుట్టముల్
నీవాల్ల భ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖో పెతులే
నీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమంబై నెసంగుదురె ? నీ తేజంబు హెచ్చిం చున్ .
అల్లాగే " చెల్లియో చెల్లకో , జెండాపై కపిరాజు " మున్నగు ప్రసిద్ధ మైన పద్యాలు మనందరికీ విదితమే
ఇంతటి ప్రసిద్ధ కవులే మనమందరము నిరంతరము తలచుకునే జంట కవులు . వారె " దివాకర్ల తిరుపతి శాస్త్రి .చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి.
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase