Pages

15, జనవరి 2011, శనివారం

" ఉంగరం "

"అబ్బో! నా ఉంగరం దొరికింది!" అంటూ మూడు పదుల సుధ మూడేళ్ళ పిల్లలా గెంతింది.

"అబ్బా! దొరికిందా! పోన్లే ఇన్ని రోజులుగా వెతుకుతున్నాం, అసలే ప్రధానపుంగరం. హమ్మయ్య! దొరికింది కదా?" అన్నాడు భర్త శ్రీను స్కూటరు పార్క్ చేసి లోపలి కొస్తూ.

"అదేనండీ! ఈ రోజు గురువారం కదా! గుడి నుంచి వచ్చేసరికి ఖచ్చితంగా దొరుకుతుందనుకున్నాను. అంతా బాబా మహత్యం" అంటూ సుధ ఉంగరంతో సహా హాల్లో కొచ్చి అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న అత్తగారికి, మామ గారికి, బావగారికి చూపించింది.

"పోనీలే మన బంగారం మంచిది, దొరికింది అంతే చాలు" అంటూ అత్తగారు ఆదిలక్ష్మి ఓ సారి ఉంగరాన్ని చేతిలోకి తీసుకుని పరికించి చూసి పక్కనే ఉన్న భర్తకి, కొడుక్కి చూపించింది సాలోచనగా వారివైపు చూస్తూ. ముగ్గురి కళ్ళల్లోను వింత మెరుపు.

ఇంత మాట్లాడుకుంటున్నా అప్పుడే సందె గుమ్మాలు ఊడ్చి వంట గదిలో జొరబడిన పెద్ద కోడలు రాణి గారు ఉలుకు పలుకు లేదు సరికదా అసలు వంట గదిదాటి బయటకు రాలేదు. అన్ని నిశితంగా గమనిస్తున్న ఆదిలక్ష్మి, సుమారు ఇరవై రోజులుగా పోయిందన్న ఉంగరం ఇల్లంతా అణువణువూ దులిపి గాలించినా దొరకని ఉంగరం అందరి బీరువాలు గాలించినా దొరకని ఉంగరం ఈ రోజు ఇంత హఠాత్తు గా అప్పుడే తుడిచిన గదిలో ఎలా దొరికిందో అర్ధం గాక ఆలోచనలో బడింది.

ఒక ఉన్నతోద్యోగిగా రెటైర్ ఐన శర్మ గారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు పెళ్ళై ఆరేళ్ళు గడిచినా ఇప్పుడే పిల్లలు వద్దని వాయిదా వేసుకున్నారేమే, ఈ మధ్య రెండేళ్ళ క్రిందట చిన్నవాడికి పెళ్ళి కావడంతో తమకింకా పిల్లలు లేకపోతే ఎదురయ్యే సమస్యలని గుర్తు చేసుకున్నట్టు తోడి కోడళ్ళిద్దరు అన్నిటితో పాటు వంతుగా పిల్లల్ని కూడా రెండు మూడు నెలలు అటూ ఇటూగా కన్నారు. అందుకే పెద్దవాడి కొడుక్కి పది నెలలు చిన్నవాడి కూతురికి ఎనిమిది నెలలు. అంచేత ఇద్దరికి చంటి పిల్లలే. ఇక అమ్మాయి నాలుగేళ్ళ క్రిందటే పెళ్ళిగావటంతో అత్తగారింట్లోనే ఉంది రెండేళ్ళ పసివాడు. బాధ్యతలు తీరి విశ్రాంతిగా ఉన్నారు ఆదిలక్ష్మి దంపతులు. ఐతే ఇంతకీ అసలు సంగతి, ఆ రోజు అదే పదిహేను ఇరవై రోజుల క్రిందట, ఏం జరిగిందంటే, ఆ రోజు శుక్రవారం కావటంతో ఉదయాన్నే తలంటు స్నానం చేసి ఆదిలక్ష్మి బయటికి వచ్చేసరికి తోడికోడళ్ళిద్దరూ వెతుకుతూ కనబడ్డారు.


"ఏమిటి? అంతగా వెతుకుతున్నారు?" అడిగింది అత్తగారు తలారబెట్టుకుంటూ.

"ఉంగరం అత్తయ్య గారు! పిల్లకి సిరిలాక్ తినిపిస్తూ తీసి పక్కన పెట్టాను. తీరా చేతులు కడుక్కుని వచ్చి చూద్దును కదా కనబడటం లేదు" అంది.

"అదేమిటి? ఇంతలో ఏమై పోతుంది? ఇంకా పనిమనిషి కూడా రాలేదుకదా ! ఉన్నది మీ ఇద్దరే కదా?" అంది ఆదిలక్ష్మి.

"అవును అదే అనుకుంటున్నాం. ఒకవేళ తుక్కులో ఏమైనా పడిందేమో?" అని నసిగారిద్దరు.

"తుడవందే తుక్కెక్కడిదీ? మొన్నటికి మొన్న నల్లపూసల దండతీసి దిండు మీద పడేసావ్. పిల్ల చేతిలోకి తీసుకుని ఆడుతోంది. గట్టిగా లాగితే? ఐనా పనిమనిషి వస్తుందేమో అన్న భయంతో తీసి నీ మంచానికున్న సొరుగులో పెట్టాను. వెంటనే చూసి తీసుకున్నావు గనుక సరిపోయింది. లేకపోతే పని వాళ్ళు తిరుగుతారు ఎవర్ననగలం ? ఐనా అంత అజాగ్రత్త ఐతే ఎలాగ? బంగారం అక్కడ ఇక్కడా పెట్టడం మంచి పద్ధతి కాదు. లక్ష్మిని లక్ష్య పెడితేనే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు!" అంటూ కాస్త గట్టిగనే మందలించింది అత్త గారు ఆదిలక్ష్మి.

ఆ రోజంతా వెతికారు. మర్నాడు శనివారం కావడంతో ఇద్దరు పుట్టిళ్ళకి వెళ్ళి పోయారు. కొంచెం ఆశ్చర్య పడింది ఆదిలక్ష్మి. ఎందుకంటే, చిన్నావిడ సాధారణంగా ప్రతి రోజూనో, రెండు రోజులకో పుట్టింటికి వెళ్ళి పోతూనే ఉంటుంది. ఎవరి అనుమతీ అవసరం లేదు ఎవరికి చెప్పవలసిన పనిలేదు. గుమ్మంలోకి వచ్చిన ఆటోని ఆపుజేసుకునో పనిమనిషితో తెప్పించుకునో ఇంకా వీలుకుదిరితే ఉదయం భర్తతోనే వెళ్ళి సాయంత్రానికో మర్నాటికో ఎప్పటికో తనిష్టం వచ్చినప్పుడు భర్తతో కలిసి వస్తూ ఉంటుంది, అది అలవాటే. కానీ పెద్దావిడ రాణి గారు మాత్రం భర్తతో స్కూటరు మీదో, కార్లోనో నెలకో రెండునెల్లకో ఓ సారి వెళ్ళి మళ్ళీ భర్త గారితోనే వచ్చేస్తుంది. అటువంటిది క్రిందటి వారమే వెళ్ళినా మళ్ళీ అంత హడావుడిగా ఎందుకు వెళ్ళిందా? అన్న ఆలోచన ఆదిలక్ష్మిని అంటి పెట్టుకుని ఉంది.

సరే ఈనాటి కోడళ్ళ గుప్పెళ్ళు నిండుగా లా పాయింట్లు. ఓ సక్కుబాయి అత్తగార్ని ఉదహరించుకుని అందర్నీ అదే కోవలో నిరూపిస్తూ అవకాశం దొరికింది కదా అని తమ సుఖాల కోసం తమ అవసరాల కోసం తమ స్వార్థం కోసం భర్తలకి నూరిపోసి తమ గుప్పెట్లో ఉంచుకున్న కోడళ్ళు స్వేచ్ఛగా రాజ్య మేలుతున్న రోజులివి. వారు ఏం చెప్పినా ఎదుటివారు నమ్మలేనంతగా బిల్డప్ప్లు ఇచ్చి అత్తల్నే అగచాట్ల పాలు చేస్తున్న కోడళ్ళ యుగమిది. అందుకే ఎంత ఆదర్శానికి పోయినా అత్తల గోడు అరణ్య రోదనే.

ఒక మనిషిని అంచనా వేయాలంటే పుట్టుకతో వచ్చిన సంస్కారమేదైనా ఉంటే తెలియాలిగానీ నేర్చుకుంటే వచ్చిన చదువు వల్ల కాదు. చరిత్ర తిరగ బడుతున్న రోజులివి. ఇలాంటి ఆడవారి మధ్య జరిగే విషయాలు పొద్దున్న పోయి సాయంత్రం ఇల్లు జేరే కొడుకులతో చెప్పుకుని వారి మనసుని గాయపరచి మనశ్శాంతి లేకుండా చేయడం ఏ తల్లికి నచ్చని పని అందుకే ఏం చేస్తాం ?

ఇలాంటి చిల్లర విషయాలన్ని మనసులోనే ఉంచుకుని భర్తతో మాత్రం ఒక మాట అంది ఆదిలక్ష్మి. ఇవన్నీ తనకి సాక్షం లేని పన్లు అనుకుంటూ, "చూడండీ! నేనిలా తలస్నానం చేసి వచ్చేసరికి ఉంగరం పోయిందన్నారు మొన్నటికి మొన్న గొలుసు సంగతి చెప్పాను కదా ! ఐనా అంత నిర్లక్ష్యం ఐతే ఎలాగ చెప్పండి ? అక్కడికీ అబ్బాయిలకి చెబితే ' మనకెందుకులే అమ్మా ఏదో ఏడవనీ ' అని తేలిగ్గా తీసి పారేసారు. ఇంక గట్టిగా నేనేమైనా అంటే అత్తగారు రాక్షసి పీక పిసికేస్తంది, కిరసనాయిలు పోసి అంటించగల్దు అని ఒక ప్రచారం. లోకం వాళ్ళ మాటే నమ్ముతుంది కానీ నిజానిజాల్ని పరిశీలించదు కదా ?" అని బాధ పడింది.

అంతా విన్న భర్త "మనకెందుకు మన డ్యూటీ ఐపోయింది. వాళ్ళ బుద్ధి వాళ్ళకే అమ్మలు ఏదైనా మంచి నేర్పి ఉంటే కాస్త మారతారు లేదా మన ఖర్మ. ఇంకా నయం విడాకులిచ్చే కోడళ్ళు లేచి పోయే కోడళ్ళు విషం కలిపే కోడళ్ళు వస్తున్న ఈ రోజుల్లో మనం సంతోషించాలి" అని భార్యని ఊరడించాడు.

వడ్డించిన విస్తరిలా అన్నీ అమర్చిన ఇంట్లో అడుగు పెట్టిన కోడళ్ళకి ఎందుకిలాంటి చిల్లర బుద్ధులో అర్థం కాని ఆదిలక్ష్మి ఈ ఉంగరం ఎలా తేల్తుందో అని వేచి చూస్తోంది. పని మనిషి కూడా రాకముందు, మరింకెవరు లేని సమయంలో ఆ ఇద్దరిమధ్య ఉంగరం పోవడమే వింతగా ఉంది. ఒక వేళ ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు దాచేసి అబద్ధం చెప్పినా అది భర్తనుంచి దాచిన డబ్బు కొంత అడిగి తీసుకున్నది కొంత కలిపి ఆకారం మార్చి అమ్మ చేయించిందని చెప్పి ఏదో ఒక రోజు గొప్పగా తనకి చూపించి వాడుకోవడం మొదలు పెడతారు. ఎందుకంటే ఇద్దరికిద్దరూ ఇలాంటి వాటిలో బాగా ఆరితేరిన వారు.

ఉమ్మడిలో ఉన్నప్పుడు జాగ్రత్తలు మెళుకువలు తెలిసిన దిట్టలు... పైగా క్రితం రోజునే పెద్దావిడ తల్లి వచ్చి వెళ్ళింది. బహుశా కూతుర్ని మందలించి "మనకెందుకే ఈ తలనొప్పి మళ్ళీ నెల్లో నీ చెల్లెలి పెళ్ళి కూడాను సెంటిమెంటల్ గా ఇది ప్రధానపు ఉంగరం అందుకని ఎక్కడో అక్కడ దొరికేలాగ పెట్టేసేయి అని చెప్పి కూతురుకిచ్చి వెళ్ళి ఉంటే త్వరలో దొరుకుతుంది. లేదా చిన్నావిడ దగ్గరే ఉండి ఉంటే అవకాశాన్ని బట్టి ఆకారం మారి ఎప్పుడో కనబడుతుంది" అని అనేకానేక ఆలోచన్లతో సతమతమౌతున్న ఆదిలక్ష్మికి ఈ రోజు జవాబు దొరికింది. కాకపోతే అసలు చిక్కు విడలేదు. ఇద్దరిలో ఎవరన్నది వారి మధ్యనే ఉండిపోయింది. పెద్దావిడ బీరువా కింద పెట్టిందా ? లేక చిన్నావిడ బీరువా కింద దొరికినట్టు గా చెప్పిందా? ఏది ఏమైతేనేం ఆకారం మారకుండా వచ్చిందంటే ఇద్దరి ప్లాను పారలేదన్న మాట ?

ఎవరి ఆలోచన్లు ఎలా ఉన్నా మొత్తానికి ఉంగరం దొరికిందన్న ఆనందం ఇల్లంతా నిండింది. ఐతే రాత్రి డైనింగు టేబుల్ దగ్గర మళ్ళీ ఒకసారి అందరికీ ఉంగరం గుర్తొచ్చింది.

"పోన్లే బాబు మన బంగారం మంచిది దొరికింది" అన్నాడు పెద్దవాడు.

"అవును ప్రధాన పుంగరం కదా సెంటిమెంటల్ గా బాధనిపించింది" అన్నాడు చిన్నవాడు.

"అంతా బాబా దయ అసలు పోయే అవకాశమే లేదు" అన్నాడు మామగారు శర్మ.

"ఏది ఏమైతేనేం దొరికింది అంతే చాలు" అంది ఆదిలక్ష్మి.

అంతా విన్న కోడళ్ళు "అత్తయ్య గారే తీసి దాచారనుకున్నాం" అన్నారు ముక్త కంఠంతో కూడా బలుక్కున్నట్టు.

అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెర్రి మొహాలు వేసారు. హఠాత్తుగా విన్న ఆదిలక్ష్మి విస్తుబోయి చేష్టలుడిగి శిలా ప్రతిమలా ఉండిపోయింది. "కోడళ్ళూ మీకు జోహార్లు మీరెంత కైనా తగిన వాళ్ళు. నిజంగా భగవంతుడనే వాడుంటే వాడే మిమ్మల్ని రక్షించాలి" బరువెక్కిన గుండెలతొ పాటు మెదడుకుడా మొద్దు బారింది.



































------------------------------------------------------------------------------


















-----------------------------------------------------------------------------



















------------------------------------------------------------------------------


















---------------------------------------------------------------------------

1 కామెంట్‌లు:

Rao S Lakkaraju చెప్పారు...

చివరికి సొడ్డు అత్తగారి మీదకే. అంతా దైవ మాయ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase