పితృ వాక్య పరిపాలకుడైన శ్రీ రామచంద్రుడు భార్యాసమేతుడై, తమ్ముడు లక్ష్మణునితో సహా అడవుల కేగిన సంగతి జగద్విదితమే. ఐతే, అలా కానన భూములలో సంచరించు సమయమున, పల్గుణీ నదీ తీరమున ఒక పర్ణశాలలో ఉన్నారు.
అప్పుడు రామ లక్షమణులు పితృ శ్రాద్ధము నిర్వహింపవలసిన తిథి వచ్చినది. అందుకు కావలసిన వస్తువులను తీసుకుని రమ్మని, చేరువనే ఉన్న ముని పల్లెకు శ్రీరాముడు లక్ష్మణుని పంపెను. లక్ష్మణుడు ఎంతకీ రానందున స్వయముగా తానే బయలుదేరెను. మధ్యాహ్న సమయము మించి పోవు చుండెను.
సీత ఒంటరిగా పర్ణశాలలో వారి రాకకై ఎదురుచూచుచూ " అపరాహ్ణము మించిన పిదప ఆబ్ధీకము పెట్టుట శాస్త్రవిరుద్ధము కదా ! " అని తలచి, తుదకు తానే ఫల్గునీ నదిలో స్నాన మాచరించి, తడిబట్టలు కట్టుకుని లభించిన వాటితో పిండప్రదానము చేసి, పితృదేవతలను తృప్తి నొందించెను.
అందులకు సంతసించిన దేవతలు "జనక నందినీ ! మేమిప్పుడు సంతృప్తి నొందినాము. నీవు మిక్కిలి ధన్యురాలవు" అన్న మాటలు ఆమెకు వినబడినవి. అంతేగాక, పితృదేవతలు ప్రీతితో ఆమె వంటకములను, శాకపాకములను పరిగ్రహించుటకై చేతులు జాచి యున్నట్లు కన్నులారా గాంచి ఆశ్చర్య చకితురాలైనది.
అప్పుడు ఆమె తన సంశయ నివృత్తికై "మహనీయులారా ! ఎవరు మీరు? ఈ వింత ఏమి?" అని సవినయముగ ప్రశ్నించినది. అందులకు దశరథుడు "అమ్మా సీతా ! నేను నీ మామను, దశరథుడను, వీరు నా పితృ పితామహులు. నీ వొనరించిన పిండ ప్రదానము స్వీకరించి మేము సంతుష్టుల మైతిమి. ఇది గయాశ్రాద్ధ ఫలితమునకెన యైనది" అని అదృశ్య రూపమున ముదమున బల్కెను.
అందులకు సీత వెరగుపడి " ఓ మహాత్మా ! నేను ధన్యు రాలను. కానీ, ఇట్టి సంఘటన మున్నెన్నడును ఎవరు విన్నదీ కన్నదీ కాదు. నేనిట్లొనరించిన పిండ ప్రదానమును చేజేతుల మీరు పరిగ్రహించితిరి. కావున మరి శ్రీ రామచంద్రు డెట్లు నమ్మగలడు? అందులకు సాక్ష్యమేమి గలదు? తామే సెలవీయ గలరు. " అని వినయముగా వేడుకొనెను.
అందులకు దశరథుడు " కోడలా ! ఈ విషయము సత్యేతరము గాదని రూఢిగా పల్కుటకు కొందరి నెవరినైనా ఏర్పాటు జేయుము " అనెను.
అప్పుడు సీతాదేవి " ఫల్గుణీ నదినీ, సమీపములో మేత మేయుచున్న గోవును, అగ్ని దేవునీ, మొగలి పువ్వును, సాక్ష మిచ్చుటకు ఆధారముగా చేసుకొంటి" నని పల్కెను. అంతట పితృదేవతలు అంతర్థాన మొందిరి.
ఇదంతయు జరిగిన పిమ్మట రామ లక్ష్మణులు శ్రాద్ధమునకు కావలసిన దినుసులు గైకొని వచ్చిరి. వెను వెంటనే శ్రీరాముడు సీతను గాంచి " దేవీ ! ఇప్పడికే కాలాతీత మైనది. కాలాతిక్రమణ దోషము ఆపాదించ కుండునట్లు నీవు త్వరిత గతిని స్నాన మాచరించి తద్దినపు వంట త్వరిత గతిని సిద్ధము చేయుము" అని ఆజ్ఞాపించెను. అందులకు సీతాదేవి చిరు నగవుతో జరిగిన దంతయు వినయముతో వివరించెను. అంతయు విన్న రామునకు నమ్మశక్యము గాక వింతగా దోచెను.
లక్ష్మణుని గాంచి " సోదరా ! ఇది ఏమి వింత ? మంత్ర తంత్రములతో ఆబ్ద్దీకమును విధి విధానముగా నొనరించుట కొడుకులకు విధ్యుక్త ధర్మముగదా ! పుత్రులు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధ కర్మలు నిర్వహించి పితృదేవతలను సంతుష్టులను జేయుట లోక సహజము కదా ! మరి కోడలు తద్దినము పెట్టుట, పెద్దలు చేజేతుల అందుకొని భుజించుట వింతగా నున్నదే ! లోకాతీతము గదా?" అని తన సందేహమును వ్యక్తపరచెను. అంతే కాదు కాలాతీతమైనందున ఆమె శ్రమ కోర్వజాలక అట్లు పలుకుచున్నదేమో అన్న అనుమానముతో సూటిగా మరల ప్రశ్నించెను. అందులకు సీత పల్గుణీ నదిని, గోవును, అగ్నినీ, కేతకీ [మొగలి పువ్వు ] పుష్పమును సాక్ష్యము చెప్పుమని కోరినది. ఆశ్చర్యము సాక్షులు మారుబల్కక మిన్నకుండిరి.
అందులకు బాధపడి చేయునది లేక సీత స్నాన మాచరించి వంట కుపక్రమించి సర్వము సిద్ధము చేసెను. తదుపరి రామ లక్ష్మణులు శ్రాద్ధము పెట్టుటకు ఉపక్రమించి పితృదేవతలను ఆహ్వానించిరి. వారి పిలుపు నందుకున్న పితృదేవతలు " కుమారులారా ! ఇది ఏమి వింత ? ఇంతకు పూర్వమే సీతాదేవి మమ్ములను ఇష్ట మృష్టాన్నములతో సంతృప్తి నొందించినది. మరల మరల ఏల పిలుచుచున్నారు ?" అని ఒక అశరీరవాణి సూర్య మండలము నుండి పలికినది.
అందులకు శ్రీరామచంద్రుడు " తాత తండ్రు లారా! జానకి మాటలను నమ్మజాలక మిమ్ము శాస్త్రోక్త విధానముగా, మంత్ర పూర్వకముగా ఆహ్వానించితిమి మన్నింపుడు " అని బదులు బల్కెను . అందులకు
" ఇక శ్రాద్ధముతో పని లేదు. మేము తృప్తిగా భుజించితిమి, పితృశేషమును ఇక మీరు భుజింపుడు " అని దశరథుడు అశరీరవాణియై బదులు పల్కెను. అంతట అన్నదమ్ములు వెరగుపడి సీతను లోలోన అభినందించిరి. ఇది ఏమి వింత అని రామ లక్ష్మణులు తలపోయుచుండగా, సూర్య భగవానుడు వారికి సర్వము వివరించెను. పూర్తిగా విన్న పిదప సీతను వేనోళ్ళ కొనియాడి భుజించిరి, పిమ్మట సీత భుజించినది.
మరి సాక్షులందరు తటస్థముగా నుండుట కేమి హేతువు అని ప్రశ్నించగా వెనువెంటనే సీత వారిని పిలిచి, ఫల్గుణీ నదిని ఉన్నది ఉన్నట్టుగా తెలుపక దాచినందుకు "పాతాళ వాహినియై" పోవునట్లుగను, ఆవు ముఖ సందర్శనము అయోగ్య మగునట్లుగను, కేతకీ పుష్పము పూజకు అనర్హమగు నట్లుగను, అగ్ని దేవుని సర్వభక్షకుడుగను శపించెను.
కావున ఆవు ముఖము చూడరాదు. అందుకనే వెనుకభాగము తోక వైపు చూడాలని, ఆచరణ యోగ్యమైనది ఫల్గునీ నది ఉన్నది ఉన్నట్లు తెలుపక దాచి నందుకు " పాతాళ వాహినియై " పోవునట్లు, ఇక అగ్ని, మొగలి తెలిసినవే.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి