Pages

24, జనవరి 2011, సోమవారం

" పద్మ సౌరభం "

ఇంటింటా ప్రతి ఇంటా చిన్న బడ్డీ కొట్టు దగ్గర్నుంచి పెద్ద పెద్ద బంగారు షాపుల్లోను, మనకి లక్ష్మీ దేవి పద్మ పీఠం మీద నెలకొని పద్మ హస్తయై కనిపిస్తూ ఉంటుంది. ఇక లలితా త్రిపుర సుందరి మహా పద్మాటవి లోనే విహరిస్తుంది. ఐతే ఈ పద్మానికి ఆద్యాత్మిక భౌతిక ప్రాముఖ్యం ఎంతగానో ఉంది. నిజానికి అసలు ముందు పద్మం పుట్టి సృష్టి తర్వాత జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పురాణయుగంలో శేషతల్పంపైన శయనించిన మహా విష్ణువు నాభి కమలం నుంచి ఒక పద్మం అవతరించిందనీ, ఆ పద్మంలో నుండి సృష్టికర్త బ్రహ్మ దేముడు ఆవిర్భ వించాడనీ, అందుకే ఆ సమయంలో ఆ కాలాన్ని పురాణాల్లో "పద్మ కల్పం" అన్నారనీ ఆ పద్మం పేరునే "పద్మ పురాణం" అనీ లోకవిదితం. అందుకే పద్మం నుంచి పుట్టిన వాడు గనుక బ్రహ్మ "పద్మ సంభవుడుగా పేరు గాంచాడు". ఐతే ఈ పద్మం ఎందరో దేవతలకి ఆసనంగా అందంగా అలరారు తుంది.ముఖ్యంగా స్త్రీల అందచందాలని కవులు "పద్మాక్షి... పద్మ నయన... పద్మానన... పాద పద్మాలు" ఇలా వర్ణిస్తూ ఉంటారు. అంతే కాదు, "పద్మినీ జాతి స్త్రీలు" అని ఒక తెగ [నాలుగు జాతుల్లో].

వికసించిన పద్మం జ్ఞనానికి చైతన్య వికాసానికి ప్రతీక ఇక కవుల హృదయాలకి శిరీష కుసుమమే. చైతన్య కేంద్రాలను "చక్రాలు" అంటారు.

ఉదాహరణకు మొదటిదైన మూలాధారం భౌతిక చైతన్యానికి కేంద్రం. ఇది ఎరుపు రంగుతో నాలుగు రేకుల పద్మంలా ఉంటుంది. ఉదరం వద్ద చైతన్య కేంద్రం గాఢమైన ఎరుపు, నీలం రంగు కలిసి ఆరు రేకుల పద్మంలా ఉంటుంది. ఆ పైన నాభి వద్ద ఊదా రంగులో[చైతన్య కేంద్రం ] పది రేకుల పద్మం లా ఉంటుంది. ఇక కంఠం వద్ద బూడిద రంగులో పదహారు రేకుల పద్మంలా ఉంటే కనుబొమల మధ్య చైతన్య కేంద్రం తెలుపు రంగులో రెండు రేకుల పద్మం లా ఉంటుంది. చివరిగా తల భాగంలో బంగారు కాంతుల మధ్య నీలి రంగులో వేయి రేకుల పద్మంలా ఉంటుంది. అమ్మవారి నెలవు అదే. కేవలం కావ్యాలలోనే గాక ఆధ్యాత్మిక పరంగా పద్మానికి గల ప్రాముఖ్యత ఎంత గొప్పదో దీన్ని బట్టి విదితమౌతుంది.

ఐతే ఈ పద్మం కేవలం మన దేశానికే కాదు, మన దేశంలోనే దేవతలకు పూజా పుష్పంగా ఆసనంగ కవులకు వర్ణనీయంగా భావించటమే కాదు, ఇతర దేశాల్లో కూడా పద్మ ప్రియులు చాలా చాలా ఉన్నారు. "జపాన్, చైనా, టిబెట్, ఈజిప్టు" వంటి అనేక చోట్ల ఈ పద్మాలు పెరుగుతాయి. అనాదిగా ఈ పూలు పెరగడమే గాక అతి పవిత్రమైన పుష్పంగా ఆరాధించడం, బౌద్ధ మతంలో కూడా దీన్ని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పూజించడం ఆచారంగా ఉంది. ఈ పద్మాలు చెరువుల్లోను, సరస్సులోను ఎక్కువగా వికసిస్తాయి. ఇంచు మించు ఒకే ఆకారం గల ఈ నీటిపూలను సంస్కృతంలో "పద్మం, కమలం, పంకజం" అని అనేక రకాలుగా పిలుస్తారు.

ఈ పద్మ పత్రాలు గుండ్రంగా ఎనభై సెంటీమీటర్ల చుట్టు కొలతతో నీటి మీద తేలుతున్నట్లుగా వ్యాపించి చెరువంతా గొడుగుల్లా అందంగా కనిపిస్తాయి. ఈ పద్మపత్రాల వేళ్ళు తెలుపు లేదా ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి ఒకోసారి మీటరు ఎత్తుగా లేదా పదిహేను సెంటీ మీటర్ల వరకు అడ్డంగా విస్తరిస్తాయి. వీటి చుట్టుకొలత ఇంచు మించు తొమ్మిది సెంటీ మీటర్ల వరకు ఉంటుంది.

ఇవి అందానికే కాదు, తినడానికి కూడా ఉపయోగించు కుంటారు. తాజా వేళ్ళను వేయించుకుని ఎండ బెట్టిన వేళ్ళను చిన్న చిన్న ముక్కలుగా తరిగి కూరల్లోకి కలుపుకుని తింటారు. చైనా, జపాన్ లాంటి ఇతర దేశాల్లో ఈ వేళ్ళతో ఊరగాయలు పెట్టి శీతాకాలంలో తినడం కద్దు.

ఈ వేళ్ళ నుంచి తయారు చేసే పాలపొడిలో ఎన్నో పోషక విలువలుంటాయి. ఇది చిన్న పిల్లల్లో అతిసారం వంటి వ్యాధులను నివారిస్తుంది. ఈ వేళ్ళతో తయారు చేసిన పేస్టు చర్మ రోగాల నివారిణి. అంతే కాదు పూల మధ్య లో ఉన్న కర్ణికను ఎండబెట్టి చైనా వారు వాసన కోసం "టీ" లో ఉపయోగిస్తారు. ఇంకా చెప్పాలంటే పద్మాల నుంచి సేకరించిన తేనెలో బలవర్ధక లక్షణాలుంటాయి. కంటి సమస్యలకు ఈ తేనె బాగా ఉపయోగ పడుతుంది. ఇక విత్తనంలో ఆకుపచ్చ రంగులో ఉండే బీజాకారం చాలా విష పూరితంగా చేదుగా ఉంటుంది. కానీ దాని చుట్టూ ఉన్న తొనల్లో అపారమైన పోషక విలువలుంటాయి, "సి" విటమిన్ ఉంటుంది. ఈజిప్టులో ఈ విత్తనాలను పిండి చేసి పాలతోగాని నీటితోగాని ఆ పిండి తడిపి రొట్టెలు చేసుకుని తింటారట. అంతే కాదు, ఈ విత్తనాలను పచ్చిగా గాని వేయించి గాని ఉడకబెట్టిగాని తినవచ్చు. సృష్టికి ముందే అవతరించిన ఈ పద్మం కనువిందు చేసే కాంతివంతమైన రూపంతో పాటు దైవికంగా సాహితీ పరంగా ఆధ్యాత్మికంగా భౌతిక చైతన్య కేంద్రంగా ఎన్నో అంద చందాలను సుమ సౌరభాలను విరజిమ్ముతూ ఇన్ని సుగుణాలను కలిగి ఉంది. మనకు ప్రకృతి పరంగా లభించిన వర ప్రసాదం ఈ అందమైన పద్మం.

2 కామెంట్‌లు:

Pranav Ainavolu చెప్పారు...

చాలా బాగుందండీ.. పద్మం విశిష్ఠత, విశ్లేషణ.
పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

కొత్త విషయాలండీ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase