Pages

10, జనవరి 2011, సోమవారం

" మంచు పూలు "

"ఆంటీ ! ఈ రోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం. మీరంతా తప్పకుండా రావాలి" అంటూ పొద్దున్నే వచ్చిన నీలిమ పిలుపు. మొన్నటికి మొన్న "ఆంటీ! ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా! మీరొచ్చి తప్పకుండా వాయనం తీసుకోవాలి. పెద్దవారు కదా, ముందుగా మీకే ఇవ్వాలని. ఈ ఏడు మా అదృష్టం. ఇక్కడ ముత్తైదువలే దొరకరు. ఒక్కరు ఇద్దరు ఉన్నా, ఆఫీసులకి వెళ్ళి పోతారు. ఇక పెద్ద వాళ్ళంటే మీలా ఎవరైనా పేరంట్సు వచ్చినప్పుడే దొరుకుతారు. నేను మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.ఒక అరగంటలో వచ్చేయండి" అంటూ ఎదురింటి రమ ఆహ్వానం .

అంతేనా? అంతకు ముందు మొన్న మంగళవారం "ఈ రోజు శ్రావణ మంగళవారం కదా! పొద్దున్నే పూజ చేసుకుని ఆఫీసుకి వెళ్ళి పోయాను. ఇప్పుడే వచ్చాను. నాకు పదిమంది, నా ఫ్రండుకి పదిహేను మంది ముత్తైదువలు కావాలి. మీరంతా ఇంట్లో ఉంటామంటే శనగలు అవీ తీసుకుని తాంబూలం ఇవ్వడానికి వస్తాము" అంటూ ఒక స్నేహితురాలు ఫోను చేసింది. "తప్పకుండా రండి. మేమెక్కడికీ వెళ్ళము. మా చుట్టు పక్కల కూడా పది మంది దాకా దొరుకుతారు. మా ఇంట్లోనే మా అత్తయ్యగారు, మా అక్కా, నేనూ ముగ్గురు ఉన్నాం..." అంటూ చిన్న కోడలు ఫోను పెట్టేసింది.

ఇదంతా చూస్తుంటే శారదకి వింతగా అనిపించింది. ఏ...మి...టీ..? ఈ అమెరికాలో, ఇంత భారతీయత ఉట్టిపడుతోందా? ఇక్కడ కూడా ఫుజలూ, వ్రతాలు, నోములు మన సంప్రదాయాలను విడనాడకుండా? నిజమే తను వచ్చినప్పట్నుంచీ చూస్తోంది. చుట్టుప్రక్కల ఏ పదిమంది ఇండియన్సు ఉన్నా, అందరు కలిసి కట్టుగా ఆడా మగా పిల్లా జెల్లా కలసి మెలసి పూజలు, పార్టీలు, పిక్ నిక్కులు చేసుకుంటూనే ఉన్నారు. వెనుక బ్యాక్ యార్డ్ లాన్ లో ఆటలు, డెక్ మీద పాతియోలు శని ఆదివారాలు సాయంత్రాలు ఆనందంగా గడుపుతారు. ఇంట్లో ఎవరి భాష వాళ్ళు మాట్లాడుకుంటారు. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం ఇలా. ఐతే, ఇంతటి ఐకమత్యం మన దగ్గర లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఎదుటివాడి ఉన్నతిని చూసి ఏడవటం, వాణ్ణి ఎలా పడగొట్టాలా అని ఎదురు చూడ్డం, అసూయా ద్వేషాలతో రగిలిపోవటం తప్ప మన ఇండియాలో ఏముంది? నడి రోడ్డుమీద పట్టపగలే హత్యలు, ఆత్మ హత్యలూ, దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు. ఇంతేగా? సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ అలాంటివేవీ ఉండవేమో అనిపిస్తుంది. పైగా ప్రతి ఇంటికీ సెక్యూరిటీ అలారం ఉంటుంది. అలారం మ్రోగితే చాలు, పోలీసులు రెక్కలు గట్టుకుని వాలతారు. నిజానికి అర్థరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరగాలన్నా ఇక్కడ భయం ఉండదు. చేను మేసే కంచెలుండవు. ఇక్కడ స్త్రీ పురష బేధం లేదు. అందర్ని అందరు బాగా చూస్తారు.

ముఖ్యంగా మన భారతీయులంటే మరింత గౌరవంగా ఆడైనా, మగైన చిరునవ్వుల పలకరింపుతో "హాయ్" చెప్పి విష్ చేస్తారు. మాల్ అయినా, బీచైనా, హోటలైన, పార్కైనా, వాకింగ్లో ఐనా ఎక్కడైనా అది వారి ఆచారం కింద చక్కగా పలకరిస్తారు. అదే మన దేశంలో దగ్గర చుట్టమైన ఎంతో పరిచయమున్న మిత్రుడైన ఇష్టం లేకపోతే ముఖం పక్కకి తిప్పుకుని వెళ్ళిపోవడం పరిపాటి. ఇక్కడ ఎవరికెవరు అపరిచితులు కారు. అందరు అందరికి పరిచితుల్లానే విష్ చేసుకుంటూ కదలిపోతారు. నిజం చెప్పాలంటే అమెరికాలో అడుగిడిన ప్రతి క్షణం ఒక వింత అనుభూతి. ఈ అందమైన ప్రకృతి సౌందర్యాలకా? దేశం కాని దేశం వచ్చినందుకా? ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలకా? ప్చ్! ఏమో తెలియదు. ఇక్కడ అందమైన అమ్మాయిల తీరుతెన్నులు, వారి జీవన విధానాలు ఈ దేశపు సంస్కృతీ సాంప్రదాయాలు, కొన్ని ఆశ్చర్యాన్ని మరికొన్ని ఆనందాన్ని కలిగిస్తాయి.

కొందరు పిల్లల్ని పెద్దల్ని చూస్తుంటే షోకేసుల్లో బొమ్మలు వీళ్ళని చూసే చేసారా అన్నంత భ్రాంతి కలుగుతుంది. అంత అందంగా ఉంటారు. ముఖ్యం గా పిల్లల్ని బాగా చూస్తారు. పసితనం నుంచీ హైస్కూలు వరకు చాలవరకు ఉచిత విధ్యా విధానమే. పదహారు సంవత్సరములు రాగానే అమ్మాయిలకు "స్వీట్ సిక్ష్టీన్ " అని గ్రాండుగా ఫంక్షను చేస్తారు (మన చిన్న సైజు పెళ్ళిలాగా ). తర్వాత పద్దెనిమిది వచ్చాక, ముఫై రోజులలోగా ఇంట్లోంచి పంపేస్తారు. (స్వీట్ సిక్ష్టీన్ ఆఫటర్ ధర్టీ డేస్). ఇంకా, వారి వారి ఇష్టాన్ని బట్టి వారి వారి జీవన విధానం ఉంటుంది. ఎక్కడైన రికార్డులో తల్లి పేరు మాత్రమే రాస్తారు. తల్లి దగ్గరకు వెళ్ళాలన్నా ముందుగా ఫోను చేసి వెళ్ళాలి, మన లాగ పుట్టింట్లో వారాలు నెలలు ఉండరు. తల్లిదండ్రులే తామే ఐనా ఎవరి బాయ్ ఫ్రండుతో వాళ్ళు ఎవరి గర్ల్ ఫ్రండుతో వాళ్ళు స్వేచ్చగా తిరుగుతారు. ఎదురెదురు పడినా పలకరించుకుని ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. అందుకే చిన్నప్పట్నుంచీ పార్ట్ టైం జాబులు చేసి సంపాదించుకోవటం నేర్పుతారు. ఎవరి గొడవ వారిదే. స్వేచ్చా జీవులు. అందుకే ఇలాంటి దేశంలో మన ఆచారాలు అలవాట్లు వదులుకుని బ్రతకాలంటే పెద్దలకి ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే కారణం ఏదైనా ఐన వాళ్ళందర్ని వదులుకుని కష్టపడి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి గనుక వృత్తిపరంగానే గాక, మన చుట్టు ప్రక్కల ఉన్న భారతీయులందరితో మన సంప్రదాయాలను పంచు కుంటూ, మనకి మనం స్వదేశీయానందాన్ని పొందవచ్చును.

అందుకే తాము రావడమే కాకుండా, తల్లిదండ్రులనీ దగ్గర ఆత్మీయులనీ, వీసాలు తెప్పించి రప్పించుకుంటున్నారు. పెద్దలకి ఈ వాతావరణం ఇక్కడి అలవాట్లు కొంచం ఇబ్బందికరమైనా, మన పిల్లల దగ్గరే కదా అనో దేశం చూడాలనో ఖచ్చితంగా వచ్చి వెడుతూ ఉంటారు. ఇక ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇంట్లో బాబా భజనలు, లలితా సహస్రాలు, వ్రతాలు, పూజలు, పార్టీలు అందరు కలిసి చేసుకుంటూ ఉంటారు. పెద్ద వాళ్ళు వచ్చారంటే మరింత ఎక్కువగా చేస్తారు. వేసవి కాలంలోనే చాలా మంది వస్తారు. ఎవరింటికి చుట్టాలు వచ్చినా, ఎంతో ఆదరాభిమానాలతో లంచులు డిన్నర్లు ఏదో వంకన పార్టీలు జరిపి కానుకలిచ్చి పంపుతూ ఉంటారు.

ఇక్కడ వెంకటేశ్వరస్వామి గుడి, దుర్గామాత గుడి, బాబా గుడి... ఇలా దేవాలయాలు ఉన్నాయి. పర్వ దినాలలో కలిసికట్టు గా వెడుతుంటారు. అక్కడ మనం మర్చిపోతున్నా మనుకుంటున్న సంస్కృతికి ఇక్కడ హారతి పడుతున్నారు. ఎటొచ్చీ అటు భారతీయతకి ఇటు అమెరికాకి మధ్య త్రిశంకు స్వర్గంలో ఉన్నవాళ్ళు అక్కడా ఇక్కడా కూడా లేకపోలేదు. నిజానికి తల్లిదండ్రుల్ని పట్టించుకోని కొడుకులూ, అత్తమామల్ని లెక్కచేయని కోడళ్ళు ఉన్న ఈ రోజుల్లో అందునా మన దేశంలో లక్షలు ఖర్చు బెట్టి ఇక్కడికి తీసుకొచ్చి దేశదేశాల సౌందర్యాలనీ, వింతలు విడ్డూరాలనీ చూపిస్తున్న కొడుకులూ, వారికి అనుగుణంగా నిండు మనసుతో ఆహ్వనించి ఆదరించే కోడళ్ళు, గ్రాండ్ మా గ్రాండ్ పా అంటూ పెద్దల ప్రేమ కోసం మురిపెంగా హత్తుకుపోయే మనవలు తిరుగు ప్రయాణం రోజున బట్టలు సర్దుతుంటే గుండెలు బరువెక్కి కళ్ళల్లో నీళ్ళు తెరిగాయి.
వెడుతున్నామని తెలిసి అందరు బయటికి వచ్చి చేయి ఊపుతూ "బై ఆంటీ! మళ్ళీ తొందరగా రావాలి" అంటూ బాధగా హావభావాలు ప్రదర్శిస్తుంటే, ఎన్ని సార్లు వచ్చి వెళ్ళినా మార్పులేని ఈ మమత, రాగాను రాగాలు, ఈ మంచు పూల మధ్య ఇంతటి ఆహ్లాదాన్ని ఒదులుకుని, ఈ బంధాలకి దూరంగా ఇవన్నీ అందర్నీ దాటుకుంటూ కారు విమానాశ్రయం వైపు కదిలే సరికి గుండెల నిండా బరువు ఈ మంచు (పూలు) నింపిన బరువు ... మోయ లేనంత... బరువు... అది... మెల్ల...గా... కరగాలే... తప్ప....? ?...?

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Nice. Akkada mana paddathulu aacharala gurinchi baga chepparu klupthamga.Memu singapore lo untam. Ikkada kuda same thathangam.Maa intiki evaru vachina vallaki kuda mugguru muthaiduvalu dorikinatte. Maa attayagaru, maa akka nenu :). So first maa ille select chesesukuntaru andaru... Ha ha ha. Ee madhya mana telugu vallu ekkuva chesthunnadhi Vibhavalakshmi vratham.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అవును మీరన్నది నిజమె ! ఇక్కడ ఎక్కువగా వైభవ లక్ష్మి వ్రతం చేస్తున్నారు." ఏదేశ మేగినా ఎందు కాలిడినా " అన్నట్టు మన ఆచారాలు మనవి కదా !మీ వ్యాఖ్యకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase